Presidential Election 2022: యశ్వంత్ సిన్హా నామినేషన్.. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయ్?

By Mahesh KFirst Published Jun 27, 2022, 2:18 PM IST
Highlights

ప్రతిపక్షాల నుంచిచ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న యశ్వంత్ సిన్హా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు శరద్ పవార్, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ హౌజ్‌కు వచ్చారు. కొన్ని పార్టీలు మినహా ప్రతిపక్ష పార్టీల నేతలంతా హాజరై.. దాదాపు బలాన్ని ప్రకటించాయి.
 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రతిపక్ష నేతలు హాజరు అయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు యశ్వంత్ సిన్హా వెంటే ఉన్నారు. ఈ పోరును భావజాలాల మధ్య పోరాటంగా ప్రతిపక్ష నేతలు అభివర్ణించారు.

యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ హౌజ్‌కు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ సిన్హా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, డీఎంకే ఏ రాజా, సీపీఐ నేత డీ రాజా, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్‌లు అటెండ్ అయ్యారు. వీరితోపాటు రాష్ట్రీయ జనతా దల్ నేత మీసా భారతి, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నేత ఎన్ కే ప్రేమచంద్రన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నేత మొహమ్మద్ బషీర్ కూడా హాజరయ్యారు.

వీరి సమక్షంలో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హాను 14 ప్రతిపక్ష పార్టీలు సమర్థిస్తున్నాయి.

కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ఈ కార్యక్రమానికి తమ ప్రతినిధులను పంపకపోవడం గమనార్హం. అలాగే, బీజేపీయేతర రెండు పెద్ద పార్టీలు బీఎస్పీ, బీజేడీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక వేళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే.. మన దేశ తొలి ట్రైబల్ ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టిస్తారు. అంతేకాదు, రెండో మహిళగానూ రికార్డు ఉంటుంది.

రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోడీకి యశ్వంత్ సిన్హా నాలుగు సెట్ల నామినేషన్ పేపర్లు అందించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేసిన యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాల అభ్యర్థిగా జూన్ 21న నిర్వహించిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఖరారు చేశారు. ఆ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టం లేక ఆయన ఆ భేటీకి హాజరు కాలేదని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, ఆయన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికే మద్దతు ప్రకటించడం ప్రతిపక్ష శిబిరానికి బూస్టింగ్ ఇచ్చింది.

ప్రస్తుత మద్దతులు చూసుకున్నా రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ రోజు సిన్హా నామినేషన్ కోసం ప్రతిపక్షాల నుంచి నేతలు చాలా వరకు వేదిక పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు ఇదొక సంకేతంగా మారింది.

అధికార పార్టీ 49 శాతం ఎలక్టోరల్ కాలేజీ కలిగి ఉన్నది. రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి 50శాతం మార్క్ దాటాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు అన్నీ కలిస్తే.. రాష్ట్రపతిని గెలిపించుకోవచ్చు. కానీ, నేడు ప్రతిపక్షాలు రాష్ట్రపతిని గెలిపించుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే.. బీఎస్పీ, బీజేడీ, వైసీపీ పార్టీలు ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. ట్రైబల్ అభ్యర్థి కావడంతో ట్రైబల్ మెజార్టీ స్టేట్‌ ఛత్తీస్‌గడ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం ప్రతిపక్షాల భేటీకి హాజరైనా.. నామినేషన్‌కు ప్రతినిధి పంపకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అలాగే.. ఆప్ కూడా తన మద్దతు ఇంకా ఎటువైపూ ప్రకటించలేదు.

click me!