
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఉదంతం ముందుకు వచ్చింది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో జీవితాన్ని పంచుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండు కుటుంబాల నుంచి వారి మధ్య సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక మహిళ ఏకంగా తన జెండర్ మార్చుకోవడానికే నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్‌లో ఇప్పుడు ఆమెకు లింగ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతున్నది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు లెస్బియన్‌లు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. గాఢంగా ప్రేమించుకుంటున్నారు. జీవితాంతం కలిసే ఉండాలని అనుకున్నారు. కానీ, ఇరు కుటుంబాలు వారి మధ్య రిలేషన్‌షిప్‌ను వ్యతిరేకించాయి. వారిద్దరూ కలిసి జీవితం పంచుకోవడానికి వీల్లేదని వాదించారు. ఇద్దరూ మహిళలే.. వారు కలిసి బతకడమేంటన్నది ఆ రెండు కుటుంబాల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న. కానీ, ఇందుకు వారిదగ్గర సమాధానం లేదు. కానీ, కలిసి ఉండాలని మాత్రం బలంగా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడే కాదు.. ఇకపైనా లింగానికి సంబంధించి తమకు సమస్యలు రావొద్దని, ఆమె శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంది.
తాను పురుషుడిగా మారాలని అనుకుంది. పురుషుడిగా మారి.. మిగతా వారిలాగే.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. ఇరు కుటుంబాల ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని యోచించింది. అంతే.. ఆమె హాస్పిటల్‌కు వెళ్లి అందుకు సంబంధించి సర్జరీలకు సిద్ధం అయింది.
ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లో ఆమె చేరింది. ఆమెకు ఓ వైద్యుల బృందం చికిత్స చేస్తున్నది. సెక్స్ రీ అసైన్‌మెంట్ సర్జరీ మొదలు పెట్టింది. ఇంతకంటే ముందు ఓ సైకియాట్రిస్ట్‌తో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించినట్టు డాక్టర్ మోహిత్ జైన్ తెలిపారు. ఆమె సర్జరీకి అన్ని విధాల సిద్ధంగా ఉన్నదని తెలిసిన తర్వాతే సర్జరీ మొదలు పెట్టినట్టు వివరించారు. సెక్స్ రీ అసైన్‌మెంట్ ఫస్ట్ ఫేజ్‌లో ఆమె బ్రెస్ట్, యుటీరస్‌ను తొలగించినట్టు తెలిసింది. అనంతం, తర్వాతి స్టెప్ ప్రకారం, ఆమెకు టెస్టోస్టిరాాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తున్నట్టు సమాచారం.
ఈ సర్జరీ 1.5 ఏళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆమె పురుషుడిగా మారిపోతుందని వివరించారు. టెస్టోస్టిరాన్ థెరపీతో ఆమె చాతిలో వెంట్రుకలు పెరుగుతాయని డాక్టర్ మోహిత్ జైన్ చెప్పారు.
ఈ సర్జరీతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 18 నెలలుపాటు సాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని చెప్పారు.