అర్థరాత్రి వరకు అమిత్ షాతో రెజ్లర్ల భేటీ.. అర్ధంతరంగా బయటకు వచ్చేసిన రెజ్లర్లు ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Jun 5, 2023, 12:58 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లు సమావేశం అయ్యారు. రాత్రి 11 గంటలకు మొదలై ఒక గంటపాటు సాగింది. కానీ, హోం మంత్రి నుంచి తమకు కావల్సిన సమాధానం రాలేదని రెజ్లర్లు ఆ తర్వాత చెప్పారు.
 

న్యూఢిల్లీ: భారత టాప్ రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి ఢిల్లీలోని అమిత్ షా నివాసంలోనే ఆయనతో సమావేశం అయ్యామని ఒలంపియన్ బజరంగ్ పునియా ఎన్డీటీవీకి వెల్లడించారు. వారి సమావేశం రాత్రి 11 గంటలకు ప్రారంభమైందని వివరించారు. ఆ భేటీ గంటపాటు సాగిందని తెలిపారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవ్రత్ కడియన్‌లు అమిత్ షాతో భేటీ అయ్యారు.

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాతో డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా వారికి భరోసా ఇచ్చినట్టు  తెలిసింది. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.

హరిద్వార్‌లో పతకాలను గంగా నదిలో కలపే నిర్ణయాన్ని నిరసనలు చేస్తున్న మల్లయోధులు రద్దు చేసుకున్న తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఐదు రోజుల గడువు పెట్టారు. ఈ ఐదు రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసింది. అదే రోజు రాత్రి వారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం గమనార్హం.

హోం మంత్రి అమిత్ షా సమాధానంపైనా ఆ రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా టుడేతో సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్ మాట్లాడుతూ.. ‘హోం మంత్రి నుంచి మేం ఆశిస్తున్న సమాధానం రాలేదు. అందుకే సమావేశం నుంచే బయటకు వచ్చేశాం. భావి నిరసనల గురించి వ్యూహాన్ని రచిస్తున్నాం. మేం వెనుదిరిగే ప్రసక్తే లేదు’ అని కడియన్ స్పష్టం చేశారు.

Also Read: Odisha: బాలాసోర్ రైలు పట్టాలపై ప్రేమ కవితలు.. డైరీలోనే ఆ ప్రేమ శిథిలం

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏడుగురు మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వారు ఆరోపణలు చేశారు. ఇందులో ఓ మైనర్ బాలిక కూడా ఉన్నది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు బ్రిజ్ భూషణ్ పై నమోదు చేశారు. ఆరుగురు మహిళలపై లైంగిక ఆరోపణలకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుపై పోక్సో చట్టం కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.

click me!