
World Tuberculosis Day 2022: ఊపిరితిత్తుల తీవ్రంగా ప్రభావితం చేసే బాక్టీరియా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాని ఆరోగ్య ప్రభావాలతో పాటు క్షయవ్యాధి సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను కూడా ఈ రోజు హైలైట్ చేస్తుంది. ఈ రోజు డాక్టర్ రాబర్ట్ కోచ్ టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు ప్రకటించిన రోజు. 1882 నాటి ఈ ఆవిష్కరణను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా World Tuberculosis Day ను జరుపుకుంటారు.
TB నివారణ మరియు సంరక్షణకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడానికి WHO యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. టీబీపై అవగాహన కల్పించడం, రక్షణ, చికిత్స విషయాలను అందరికి తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. TB ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధులలో ఒకటి. ప్రతిరోజు సుమారు 4000 మంది TBతో తమ జీవితాలను కోల్పోతున్నారు. దాదాపు 28,000 మంది నివారించదగిన మరియు చికిత్స అందించగల స్థితిలోకి జారుకుంటున్నారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం చరిత్ర ఇది.. !
డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్) 1882 మార్చి 24న మొదటిసారిగా కనుగొన్నాడు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్, రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి క్షయవ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం థీమ్ “టీబీని అంతం చేయడానికి పెట్టుబడి పెట్టండి. ప్రాణాలు కాపాడండి "(invest to End TB. Save Lives). ఈ వ్యాధిని నిర్మూలించడానికి అవసరమైన పెట్టుబడులు మరియు వనరుల ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది. ఈ వ్యాధితో పోరాడటానికి వారి నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రపంచ నాయకులకు ఈ అవసరాలను తెలియజేయడానికి ఇది ఒక మార్గం. WHO ద్వారా యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడానికి థీమ్ TB నివారణ, సంరక్షణకు యాక్సెస్‌ను నిర్ధారిస్తుంది.
క్షయ వ్యాధి లక్షణాలు
క్షయవ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు, అయితే లక్షణాలు సాధారణంగా ప్రారంభ దశలో పెద్దగా కనిపించవు. టీబీ లక్షణాలు ఇలా ఉంటాయి..
1. కనీసం 3 వారాల పాటు కొనసాగే నిరంతర దగ్గు క్షయవ్యాధి ప్రధాన లక్షణం.
2. దగ్గు సమయంలో రక్తంతో పాటు కఫం వస్తుంది.
3. చలి, జ్వరం, ఆకలి లేకపోవడం మరియు బరువు తగ్గడం ఇతర లక్షణాలు.
4. రాత్రి చెమటలు మరియు ఛాతీ నొప్పి కూడా వ్యాధిలో భాగమే.
5. TB కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, మూర్ఛలు మరియు నిరంతర తలనొప్పికి కూడా కారణమవుతుంది.
6. మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.
టీబీ చికిత్స
క్షయవ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. వ్యాధికి చికిత్స చేసేటప్పుడు TB జాతి కూడా ముఖ్యమైనది. ప్రారంభంలో TB చికిత్సలో యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఉంటుంది. టీబీ ప్రభావం అధికంగా ఉంటే.. దాదాపు తొమ్మిది నెలల పాటు రోగులు అనేక ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ, TB డ్రగ్-రెసిస్టెంట్ స్ట్రెయిన్ ఉన్న రోగులకు చికిత్స మరింత క్లిష్టంగా మారుతుందని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు క్షయను గుర్తించడానికి అధునాతన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.