రోడ్డు ప్రమాదాలు ఇండియాలోనే ఎక్కువట .. 10 ఏళ్లలో ఎంతమంది చనిపోయారో తెలుసా, ఎందుకిలా..?

By Siva KodatiFirst Published Dec 17, 2023, 8:45 PM IST
Highlights

ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి 100 మంది రోడ్డు ప్రమాద మృతుల్లో 13 మంది భారతీయులేనట.

ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అన్ని దేశాల్లో ప్రమాదాలు తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం వున్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య తగ్గిపోతుండగా.. భారత్‌లో మాత్రం 15 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2010లో 1.34 లక్షలు సంభవించగా అవి 2021లో 1.5 లక్షలకు పెరిగాయని వివరించింది. ప్రపంచంలో ప్రతి 100 మంది రోడ్డు ప్రమాద మృతుల్లో 13 మంది భారతీయులేనట.

నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గగా, మరో 35 దేశాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గిపోయాయని నివేదిక తెలిపింది. 2019 నాటికి ప్రపంచంలో 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీ యువకుల మరణాలకు రోడ్డు ప్రమాదాలే కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. బాధితుల్లో మూడింట రెండోంతుల మంది పనిచేసే వయసు వారేనని పేర్కొంది. ఇక గడిచిన దశాబ్ధ కాలంలో ప్రపంచ జనాభా 140 కోట్లు పెరగ్గా.. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు మాత్రం 5 శాతం తగ్గిపోయాయి. 

Latest Videos

మరోవైపు.. గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరగ్గా.. ప్రతి 1 లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47 శాతానికి తగ్గింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో 28 శాతం, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 25 శాతం, ఆఫ్రికా ప్రాంతంలో 19 శాతం, అమెరికాలో 12 శాతం, మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో 11 శాతం , ఐరోపా దేశాల్లో 5 శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారట. అలాగే ప్రతి పది మరణాల్లో 9 పేద, మధ్య స్థాయి దేశాల్లోనే సంభవిస్తున్నాయట. పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది. 

అయితే యువత, చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధకైనా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలను చాలా దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని.. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారణమైనా శిక్షలు కఠినంగా వుంటాయని వారు అంటున్నారు. భారత్‌లోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించొచ్చని మేధావులు చెబుతున్నారు. 

click me!