
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ఓ షాపులో పని చేసే వర్కర్ యజమాని ఇంటికి వెళ్లి ఆయన తల్లిని గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత రూ. 20 వేలు పట్టుకుని ఏమీ ఎరగనట్టు మళ్లీ షాప్‌కు వచ్చాడు. అంతకు ముందే ఇంటి నుంచి రూ. 90 వేలు కొట్టేసి షాప్‌లో దాచిన చోటుకు వెళ్లాడు. కానీ, అక్కడ ఆ డబ్బులు లేవు. ఇంతలో విషయం అంతా తెలియడంతో ఆ వర్కర్‌ను పట్టుకోవడం కష్టమేమీ కాలేదు. ఆ వర్కర్ దగ్గర నుంచి దొంగిలించిన రూ. 20 వేలనూ మళ్లీ రికవరీ చేసుకున్నారు.
నేరం రిపోర్ట్ అయిన నాలుగు గంటల్లో నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌కు చెందిన 18 ఏళ్ల రోహిత్ దూబే ఢిల్లీలోని ఓ కచోరీ షాప్‌లో పనికి కుదిరాడు. రోహిత్ దూబే బంధువు ఒకరు మనీష్ జైన్ షాపులో పని చూసి పెట్టించాడు. ఒక రోజు రోహిత్ దూబే మనీష్ జైన్ ఇంట్లో నుంచి రూ. 90 వేలు దొంగిలించాడు. వాటిని తీసుకువచ్చి షాపులోని ఓ రహస్య ప్రాంతంలో దాచి పెట్టాడు. ఈ విషయం యజమాని మనీష్ జైన్‌కు తెలిసింది. కానీ, ఆయన రోహిత్ దూబేను ఏమీ అనలేదు. ఆ షాపునకు సమీపంలోని అంతకు ముందే కేటాయించిన గదిలోనే ఉండనిచ్చాడు. కానీ, మనీష్ జైన్ ఇక రోహిత్ దూబేతో తన షాప్‌లో పని చేయించుకోవాలని భావించలేదు.
అందుకే రూ. 90 వేలు దొంగిలించి షాపులో దాచినట్టు తెలిసిన తర్వాతి రోజే మనీష్ జైన్ రోహిత్ దూబేను మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామానికి పంపడానికి నిర్ణయించుకున్నాడు. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాడు. రోహిత్ దూబేను హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దిగబెట్టి వచ్చాడు. ఇక రోహిత్ దూబే ఎపిసోడ్ ముగిసిందని ఆయన అనుకున్నాడు. కానీ, రోహిత్ దూబే మళ్లీ ఢిల్లీకి వచ్చాడు. నేరుగా మనీష్ జైన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రూ. 20 వేలు మళ్లీ దొంగిలించాడు. దీన్ని మనీష్ తల్లి సరోజ్ జైన్ గుర్తించారు. రోహిత్ దూబేను అడ్డుకునే ప్రయత్నం చేసింది. రోహిత్ దూబే అప్పుడు కర్కశంగా వ్యవహరించారు. ఆ పెద్దావిడను నిర్దాక్షిణ్యంగా బలంగా వెనక్కి నెట్టేశాడు. ఆమె నేలపై పడిపోయారు. అయినా.. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాలితో ఆమె గొంతు నులిమేశాడు. ఆమె గొంతు ఎముక విరిగిపోయింది.
ఆ తర్వాత రోహిత్ దూబే షాప్‌నకు వెళ్లాడు. అక్కడ గతంలో తాను రహస్యంగా దాచిపెట్టిన డబ్బుల కోసం వెతికాడు. అయితే, అప్పటికే విషయం తెలియడంతో మనీష్ జైన్ దగ్గర పనిచేస్తున్న సిబ్బందే రోహిత్ దూబేను పట్టుకున్నారు. మొత్తంగా లక్ష రూపాయలు దొంగిలించి ఇంటికి తీసుెళ్లాలని ప్లాన్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
బుధవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో పశ్చిమ్ విహార్‌లోని బాలాజీ యాక్షన్ హాస్పిటల్ నుంచి పోలీసులకు వైద్యులు సమాచారం ఇచ్చారు. సరోజ్ జైన్ అనే పెద్దావిడను ఆమె కొడుకు మనీష్ జైన్ హాస్పిటల్ తీసుకువచ్చాడని, ఆమె గొంతు నులిమేయడం కారణంగా మరణించినట్టు ప్రాథమికంగా అర్థం అవుతున్నదని పోలీసులకు వివరించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరగా.. కొడుకు మనీష్ జైన్ పైన జరిగిన విషయాన్ని వివరించాడు.