
న్యూఢిల్లీ : మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న సంగీతకారుడు రికీ కేజ్ భారతస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూపొందించిన ఓ జాతీయగీతంపై ప్రధాని మోదీ స్పందించారు. రికీ కేజ్ 100 మంది సభ్యుల బ్రిటిష్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి భారత జాతీయ గీతాన్ని వాయిద్యాల రూపొందించి వినిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.. “అద్భుతం. ఇది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు గర్వించేలా చేస్తుంది’’ అన్నారు.
రికీ కేజ్ ఈ 60 సెకన్ల వీడియోను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి కానుకగా ఆగస్టు 14న విడుదల చేశారు. లండన్‌లోని లెజెండరీ అబ్బే రోడ్ స్టూడియోస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రా రికార్డ్ చేసిన భారతీయ జాతీయ గీతం ఈ రెండిషన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలవుతుంది.
‘‘3D’’ మంత్రం.. త్వరలో విశ్వకర్మ పథకం.. మోదీ ప్రసంగంలోని కీలక అంశాలు..
కేజ్ ట్విటర్ లో వీడియోను పంచుకున్నారు. దానికి క్యాప్షన్ గా.. “లండన్‌లోని లెజెండరీ అబ్బే రోడ్ స్టూడియోస్‌లో భారతదేశ జాతీయ గీతాన్ని ప్రదర్శించడానికి 100-పీస్ బ్రిటిష్ ఆర్కెస్ట్రా, రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాను నిర్వహించాను. ఇది భారతదేశ జాతీయ గీతాన్ని రికార్డ్ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా. ఎంతో అద్భుతంగా ఉంది. చివర్లో "జయ హే" అని వచ్చే సమయంలో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అది చేసేప్పుడు భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందాను. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రక రికార్డింగ్‌ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలనుకుంటున్నాను. దీన్ని చూడండి, మీ వాల్ పై పోస్ట్ చేయండి, షేర్ చేయండి.. ఇప్పుడు ఈ గీతం మీదే. జై హింద్. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు #రికీకేజ్ @narendramodi" అంటూ చెప్పుకొచ్చారు.
3 సార్లు గ్రామీ-విజేత అయిన ఈ స్వరకర్త ఈ జాతీయ గీతం గురించి తన ఇష్టాన్ని, ప్రేమను ఏఎన్ఐతో పంచుకుంటూ.. "పాటను స్వరపరచడం విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. మనది కొత్త భారతదేశం. మనం వాతావరణ మార్పులనుంచి ప్రపంచ ఆర్థిక శాస్త్రం వంటి అంతర్జాతీయ నిర్ణయాలలో పాల్గొంటున్నాం. నిజానికి ఇతర దేశాలు మన నుండి నాయకత్వం తీసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ గీతం భారత జాతీయ గీతాన్ని రికార్డ్ చేయడానికి రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా 100 మంది సభ్యులతో కూడిన అతిపెద్ద ఆర్కెస్ట్రాతో నూతన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది" అన్నారు.
అయితే ఇది రికీ కేజ్‌కి మొదటి ప్రదర్శన కాదు. 2022లో, భారతదేశానికి చెందిన 12 మంది శరణార్థి గాయకులతో కూడా గీతాన్ని ప్రదర్శించాడు. గాయకులు మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్, ఇతర ప్రాంతాలకు చెందినవారు. రికీ కేజ్ లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి ఒక ప్రత్యేకమైన సృజన చేయడం ద్వారా జాతీయ గీతానికి కొత్త సుబగులు అద్దారు.