
హర్యానా, రోహ్ తక్ లో దారుణ ఘటన జరిగింది. రోహ్ తక్ లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజ్లర్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
ఈ కాల్పుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్ లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండడం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ కాల్పులకు రెజ్లింగ్ కోచ్ ల మధ్య వక్తిగత శత్రుత్వమే కారణమని తాజా సమాచారం.
బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు పరిశీలుస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహ్ తక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ కాల్పుల్లో చనిపోయిన దంపతులు మనోజ్, సాక్షిల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఐదుగురు మృతుల్లో కోచ్ దంపతులైన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి లు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన వారని తెలిపారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్లు జా, ప్రదీప్ మాలిక్ లుగా గుర్తించారు.