Mumbai Local Train: కదులుతున్న ట్రైన్‌లోకి నెట్టుకుంటూ మహిళలు.. వైరల్ వీడియోపై రచ్చ

కదులుతున్న ముంబయి లోకల్ ట్రైన్‌లోకి తోసుకుంటూ చాలా ఇబ్బందికరంగా మహిళలు ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.
 

Google News Follow Us

ముంబయి: ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లడానికి ట్రైన్‌లలో ప్రయాణిస్తే.. రద్దీ సమయాల్లో ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆఫీసు నుంచి లేదా ఇతర పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ప్రయాణంలో కాస్త విశ్రాంతి కోసం వేగంగా ట్రైన్ ఎక్కి సీటును ఆపుకునే ప్రయత్నం చేయడాన్ని అందరం అర్థం చేసుకోగలం. అప్పటికే అలసిపోయాక ప్రయాణ సమయంలో కొంత విశ్రాంతి కోసం ఆరాటపడటంలో తప్పు లేదు. కానీ, ఎంత మూల్యానికి అనేదే ప్రశ్న.

ఆ ఖాళీ సీట్ల కోసం కదులుతున్న ట్రైన్‌లోకి ఆదరాబాదరాగా ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కడం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఏ కాస్త పొరపాటు జరిగినా తీవ్ర ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. అందుకే ఖాళీ సీటు ఎంత మూల్యానికి అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎక్స్‌లో అక్షయ్ అనే యూజర్ ముంబయి ట్రైన్‌లో మహిళలు ఎలా తోసుకుంటూ ఎక్కుతున్నారో చూపించే ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ ట్రైన్ ఇంకా ఆగనేలేదు. కానీ, వారు లోనికి వెళ్లి సీటు ఆపుకోవడం కోసం తెగ తాపత్రయపడటాన్ని మనం ఆ వీడియోలో చూస్తాం.

సెప్టెంబర్ 16న పోస్టు చేసిన ఈ వీడియోలో ఈ దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ట్రైన్ ఇంకా ఆగకముందే వారు నెట్టుకుంటూ వేగంగా పైకి ఎక్కడంతో కొందరు ఇంకా బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దృశ్యాలూ అందులో ఉన్నాయి. అయితే.. వారు ఖాళీ సీటు కోసం ఈ రిస్క్ చేస్తుండటమే చర్చనీయాంశమైంది. వారి ప్రాణాలనే కాదు.. ఎదుటి వారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్నారని అభిప్రాయాలు వచ్చాయి.

Also Read: మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసుల దుర్మరణం.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు..

ఈ వీడియో కింద చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ఇది ముంబయి యొక్క అవిశ్రాంత లక్షణం అని కొందరు కొనియాడగా..  మరికొందరు విమర్శలు చేశారు. తాను ఒకసారి లోకల్ ట్రైన్‌లో వెళ్లుతుండగా.. తొందరగా దిగేసేయ్.. ఏంటీ ట్రైన్ ఆగేదాకా దిగవా ఏంటీ? అని తనను అడిగినట్టు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ ప్రశ్న తన బుర్రలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుందని తెలిపారు. మరికొందరు.. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికే ముంబయి నగరాన్ని వదిలిపెట్టినట్టు కామెంట్లు చేశారు. 

ముంబయిలో ఇది చాలా కామన్, ఇంకా పీక్ అవర్స్‌లో దారుణంగా ఉంటుందని చాలా మంది యూజర్లు చెప్పారు.