
కర్ణాటక : జీవితం ఇబ్బందుల్లో పడిందని ఆవేదనకు గురైన ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగళ తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గంగొండనహళ్లి నివాసి, ఐటీ ఉద్యోగి అయిన అనిత (25) ఆత్మహత్య చేసుకుంది. మహిళా టెకీ అయిన అనిత తాను పనిచేస్తున్న కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తిని ప్రేమించింది. వివాహం చేసుకుంది. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ, ఆరునెలలు గడిచేసరికి సమస్యలు మొదలయ్యాయి.
ప్రదీప్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. కట్నం కావాలని వేధించడం మొదలుపెట్టాడు. అప్పటికి కానీ అనితకు తను చేసిన పొరపాటు అర్థం కాలేదు. దీంతో అతనితో జీవించడం ఇష్టం లేక అనిత విడాకులు తీసుకోవాలనుకుంది. దీనికోసం కోర్టులో కేసు వేసింది. గురువారం కోర్లు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కాగా బుధవారం నాడు.. జీవితంలో తాను తప్పటడుగులు వేశానని విరక్తి చెందిన అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనిత భర్త ప్రదీప్, అతడి తల్లి ఇద్దరూ పరారీలో ఉన్నారు.
ఉరివేసుకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
కాగా, మే నెలలో తిరుపతిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావ్య మృతి కలకలం రేపింది. కావ్యపై నెల్లూరు జిల్లా తాటిపర్తిలో కాల్పులు జరిపి.. తాను కాల్చుకున్న సురేష్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆయనకు సహకరించిన మిత్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. సురేష్ రెడ్డికి చెందిన రెండు సెల్ ఫోన్ల డాటాను సేకరిస్తున్నారు.
సురేష్ రెడ్డి తను వాడిన గన్ తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సురేష్ రెడ్డి కావ్యపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. మరోటి తనను కాల్చుకోవడానికి వాడాడు. మిగతా రెండు రౌండ్ల బుల్లెట్లను ఎక్కడ వాడాడనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. సురేష్ రెడ్డి ఏయే ఫోన్ నెంబర్లు వాడాడు, ఎవరెవరికి ఫోన్లు చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సురేష్ రెడ్డి వాడిన గన్ మీద మేడ్ ఇన్ అమెరికా అని ఉంది. గన్ అతను బెంగళూరులో సేకరించాడా, మరెక్కడ సహకరించారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. వయసు తేడా రీత్యా కావ్య తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఇరువురి మధ్య 13 ఏళ్ల తేడా ఉంటుంది.
కాగా, మే 9న సాయంత్రం కావ్యరెడ్డిపై కాల్పులు జరిపి మాలపాటి సురేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు. మాలపాటి సురేష్ రెడ్డి ఉపయోగించిన తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందన్నారు. అయితే, ఈ తుపాకీ ఇక్కడే తయారు చేసి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. మే 9న మధ్యాహ్నం కావ్యరెడ్డి ఇంటికి వెళ్లిన సురేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు.
కావ్యను పెళ్లి చేసుకోవాలనుకున్న సురేష్ రెడ్డి కావ్య కుటుంబ సభ్యులతో చర్చించాడు. అయితే, కావ్య, సురేష్ రెడ్డితో పెళ్ళికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సురేష్ రెడ్డి కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా వీరిద్దరూ సొంత ఊర్లనుంచే పనులు చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. అంతేకాదు సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.