నైట్ డ్యూటీ నుంచి వస్తున్న మహిళా పోలీసును వెంబడించి, వేధింపులు.. ముగ్గురు అరెస్ట్‌

By SumaBala BukkaFirst Published Jan 6, 2023, 9:32 AM IST
Highlights

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న రాత్రి డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీలో ఆమెను వెంబడించారు. అసభ్య పదజాలంతో దూషించారు. 

భువనేశ్వర్ : ఒడిశాలోని భువనేశ్వర్ లో  మహిళా పోలీసులు వేధించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధిత మహిళా పోలీసు నైట్ డ్యూటీ ముగించుకుని తన కారులో ఇంటికి తిరిగి వెడుతోంది. ఈ సమయంలో మహిళా పోలీసు అధికారిని వెంబడించిన ముగ్గురు ట్యాక్సీ డ్రైవర్లు ఆమెను తిడుతూ.. కత్తితో బెదిరిస్తూ చాలాసేపు వేధించారు. ఈ ఆరోపణల మేరకు ముగ్గురు టాక్సీ డ్రైవర్లను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

ఈ ముగ్గురు నిందితులని భువనేశ్వర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శుభశ్రీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 2న సైన్స్ పార్క్ ఏరియా సమీపంలో రాత్రి డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను ఎస్‌యూవీలో వెంబడించారు. అసభ్య పదజాలంతో దూషించారు. 

దారుణం.. స్కూటర్ ను ఢీకొట్టిన ట్రక్.. 1.5 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లడంతో చెలరేగిన మంటలు.. బాధితుడు మృతి

వారి నుంచి తప్పించుకోవడానికి ఆమె తన కారు దారి మళ్లించి పోలీస్ రిజర్వ్ గ్రౌండ్ సమీపంలోకి చేరుకుంది. అక్కడికి వారు ఆమెను అనుసరించి వచ్చారు. అక్కడ ముగ్గురిలో ఒకడు కత్తి తీసి ఆమెను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న కొంతమంది పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన నిందితులు ఎస్వీయూలో వేగంగా వెళ్లిపోయారు.

ఆమె ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వాహనాన్ని గుర్తించారు. ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సింగ్ చెప్పారు. వీరు వృత్తి రీత్యా ట్యాక్సీ డ్రైవర్లు అని కూడా తమ విచారణలో తేలిందన్నారు. 

click me!