లూడో గేమ్‌ వ్యసనం.. ఆమెపైనే బెట్ వేసుకుని ఓనర్ చేతిలో ఓడిన మహిళ.. భర్తకు తిప్పలు

By Mahesh KFirst Published Dec 5, 2022, 3:00 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ రోజూ తన ఇంటి యజమానితో లూడో గేమ్ ఆడేది. అందులో తన భర్త పంపిన డబ్బులను బెట్టింగ్ పెట్టి ఆడేది. ఓ రోజు డబ్బులన్నీ అయిపోవడంతో తనపైనే బెట్ పెట్టుకుంది. అందులోనూ ఓడిపోయింది. విషయం తెలుసుకున్న భర్త ఇంటికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. 
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో లూడో గేమ్ వ్యసనం ఓ మహిళ కాపురాన్నే దెబ్బతీసింది. భర్త కష్టపడి పంపించిన డబ్బులను ఆమె లూడో గేమ్ ఆడటంలో ఖర్చు పెట్టింది. డబ్బులన్నీ అయిపోవడంతో ఏకంగా తనపైనే బెట్ వేసుకుంది. తన ఇంటి యజమానితో ఆడిన ఆ గేమ్‌లోనూ ఆమె ఓడిపోవడంతో భర్తకు తిప్పలు మొదలయ్యాయి.

ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గడ్‌లో రేణు అనే మహిళ నివసిస్తున్నది. నగర్ కొత్వాలీలోని దేవకలి ఏరియాలో అద్దె ఇంటిలో నివసిస్తున్నది. ఆమె భర్త రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో పని చేస్తాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.

ఆ మహిళ లూడో గేమ్‌కు బానిసైంది. రెగ్యులర్‌గా ఆమె ఇంటి యజమానితో లూడో గేమ్ ఆడటం మొదలు పెట్టింది. ఓ రోజు ఆమె లూడో గేమ్‌లో బెట్టింగ్ పెట్టి తన డబ్బులు అన్నీ పోగొట్టుకున్నది. దీంతో ఆమె తన పైనే బెట్ పెట్టుకున్నది. అందులోనే తన ఇంటి యజమానితో ఓడిపోయింది.

Also Read: తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...

అనంతరం, ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తంగా వివరించింది. ఇది విని ఆమె భర్త వెంటనే జైపూర్ నుంచి ప్రతాప్‌గడ్‌కు వచ్చేశాడు. పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన ఘటనను వివరిస్తూ ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది.

రేణు భర్త మాట్లాడుతూ, తాను దేవకలిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నానని, ఆరు నెలల క్రితమే జైపూర్‌కు వెళ్లి పని చేస్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచే తన భార్యకు డబ్బులు పంపిస్తున్నా అని వివరించాడు. కానీ, ఆ డబ్బులను తన భార్య గ్యాంబ్లింగ్‌కు వినియోగించుకుందని తెలిపాడు. డబ్బులు అన్నీ అయిపోయాక ఆమె పైనే బెట్టింగ్ పెట్టుకున్నదని వివరించాడు. ఆ గేమ్‌లోనూ ఓడిపోయిందని పేర్కొన్నాడు.

ఇప్పుడు తన భార్య.. ఇంటి యజమానితో నివసించడం మొదలు పెట్టిందని ఆయన తెలిపాడు. అతడిని వదిలిపెట్టేలా చేయడానికి తాను ప్రయత్నించానని వివరించాడు. కానీ, ఆమె అందుకు సిద్ధంగా లేదని అన్నాడు.

ఈ ఘటనపై పోలీసు అధికారి సుబోధ్ గౌతమ్ స్పందించారు. ఆ వ్యక్తిని కలిసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అతడిని కలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని చెప్పారు.

click me!