నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీజేఐకి లేఖ

By Mahesh KFirst Published Jul 1, 2022, 7:47 PM IST
Highlights

ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ నుపుర్ శర్మ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను ఆశ్రయించింది. ఈ మేరకు ఓ లెటర్ రూపంలో పిటిషన్ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన అజయ్ శర్మ ఈ లేఖ ఇచ్చారు.
 

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రతినిధి పదవి నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మపై ఈ రోజు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మండిపడిన సంగతి తెలిసిందే. ఆమె నోటికి వచ్చినట్టుగా మాట్లాడి దేశాన్ని అగ్గి కుంపట్లోకి నెట్టిందని సీరియస్ అయింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న విపరిణామాలకు ఆమె కారణంగా ఉన్నదని ఫైర్ అయింది. నుపుర్ శర్మపై చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సదరు న్యాయమూర్తులను ఆదేశించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఓ లేఖ ఇచ్చారు. 

గతంలో జరిగిన ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆ సంవాదంలో ఆమె మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కేవలం దేశంలోనే కాదు.. ఇతర దేశాల నుంచి భారత్‌పై నిరసన వచ్చింది. ఈ వ్యాఖ్యల కారణంగా ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులన్నింటినీ దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నుపుర్ శర్మ పిటిషన్‌ను ఈ రోజు న్యాయమూర్తులు సూర్య కాంత్, జేబీ పర్దివాలాలు విచారించారు. ఈ పిటిషన్‌ను వారు తోసిపుచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని కేసుల దర్యాప్తును ఢిల్లీకి బదిలీ చేసే అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయాలని సూచించారు. అదే సమయంలో నుపుర్ శర్మపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలను ఆమె చీప్ పబ్లిసిటీ కోసం లేదా పొలిటికల్ ఎజెండా, లేదా ఇతర నీచమైన పనుల కోసం చేసినట్టు ఉన్నదని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. టీవీ డిబేట్‌లో ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడి దేశంలో అగ్ని రగిల్చిందని తెలిపింది. అయినా.. ఆమె పదేళ్లు న్యాయవాదిగా చేస్తున్నట్టు తెలిపిందని వివరించింది. సిగ్గు చేటు వ్యాఖ్యలు అని పేర్కొంది. ఆమె వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాల్సిందని మండిపడింది. అంతేకాదు, ఆమెకు అధికారం తలకు ఎక్కిందనీ పేర్కొంది.

దీంతో ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ ముందే పిటిషన్ వేయడం గమనార్హం. ఢిల్లీకి చెందిన సోషల్ యాక్టివిస్ట్‌గా పేర్కొన్న అజయ్ గౌతమ్ ఓ లెటర్ పిటిషన్‌ను సీజేఐ ఎన్వీ రమణకు సమర్పించారు. నుపుర్ శర్మపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి తగిన ఆదేశాలు లేదా సూచనలు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం రీతిలో లేఖ ఇచ్చారు. తద్వార ఆమె పారదర్శకమైన విచారణను పొందుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల దర్యాప్తును ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ పేర్కొంది.

click me!