పీఎల్‌కేను బీజేపీలో విలీనం చేయనున్న అమరీందర్ సింగ్! వచ్చే వారంలో ప్రకటన?

By Mahesh KFirst Published Jul 1, 2022, 6:40 PM IST
Highlights

కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 8 నెలల తర్వాత ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తున్నది. గతేడాది పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
 

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌కే)ను స్థాపించారు. ఇప్పుడు ఈ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

80 ఏళ్ల మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ సర్జరీ కోసం లండన్‌లో ఉన్నారు. ఆదివారం ఆయన సర్జరీ చేసుకున్నారు. ఈ సర్జరీ తర్వాత పీఎం నరేంద్ర మోడీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన వచ్చే వారం భారత్‌కు తిరిగి రాబోతున్నట్టు తెలిసింది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు రాజకీయవర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన 8 నెలల తర్వాత ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు తెలిసింది.

గత ఏడాది పంజాబ్‌లో అప్పటి ప్రభుత్వంలో ఉన్న అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నవజోత్ సింగ్ సిద్దూ వైపే మొగ్గింది. అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం అయ్యారు. అప్పుడే ఆయన బీజేపీలో చేరుతారని, లేదా సొంత పార్టీ పెట్టుకుని బీజేపీకి మద్దతు ఇస్తారనే విశ్లేషణలు వచ్చాయి. 

ఆ తర్వాత ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చారు. కానీ, ఆయనే పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

click me!