సూపర్ మార్కెట్లలో వైన్స్ అమ్మకాలు.. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

By team teluguFirst Published Jan 28, 2022, 11:18 AM IST
Highlights

మ‌హారాష్ట్ర‌లోని సూప‌ర్ మార్కెట్లు, వాక్-ఇన్ స్టోర్ల లో ఇక  నుంచి వైన్ దొర‌క‌నుంది. ఈ మేర‌కు వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను ఆ రాష్ట్ర కేబినేట్ గురువారం ఆమోదించింది.

ప్రస్తుతం మనకు వైన్ (wine) కావాలంటే ఎక్క‌డికెళ్తాం. ఏ వైన్ షాప్ కో, లేక‌పోతే బార్ (bar) కో వెళ్తాం. కానీ మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌లే ఉండే పెద్ద షాప్ లోనో, సూప‌ర్ మార్కెట్లోనో వైన్ దొరికితే భ‌లే ఉంటుంది క‌దా.. ఆ ఊహే ఎంత బాగుందంటారా ?  ప్ర‌స్తుతానికి ఇది ఊహే.. కానీ త్వ‌ర‌లోనే నిజం కానుంది. ఎక్క‌డ ? ఎప్ప‌టి నుంచి వంటి ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయా ? పూర్తి  వివ‌రాలు తెలుసుకోవాల‌ని ఉందా ? అయితే వెంట‌నే ఇది చ‌దివేయండి. 

మ‌హారాష్ట్ర‌లోని సూప‌ర్ మార్కెట్లు (super markets), వాక్-ఇన్ స్టోర్ల (walk in store)లో ఇక నుంచి వైన్ (wine)దొర‌క‌నుంది. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (maharstra government) వైన్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం గురువారం విడుద‌ల చేసిన ప్ర‌క‌టన ప్ర‌కారం.. 1,000 చదరపు అడుగుల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్‌ (super markets)లు, దుకాణాలు ‘మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (maharastra shops and establishment act) ’ కింద “షెల్ఫ్-ఇన్-షాప్ (shelf-in-shop)” పద్ధతిని అవలంబించవచ్చు. అంటే ప్రజలు నేరుగా ఆయా షాప్ ల‌కు వ‌చ్చి వైన్ కొనుగోలు తీసుకొని వెళ్లిపోవ‌చ్చు. అక్క‌డే తాగ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. 

అయితే ప్రార్థనా స్థలాలు,  విద్యా సంస్థల సమీపంలోని సూపర్ మార్కెట్ల‌లో  వైన్ విక్రయించడానికి అనుమతి లేదు. మ‌ద్య నిషేదం అమ‌లుల్లో ఉన్న జిల్లాల్లో ఈ వైన్ అమ్మకాలకు అనుమ‌తి ఉండ‌ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే వైన్ విక్ర‌యించాల‌ని భావించే సూపర్ మార్కెట్లు లైసెన్స్ (licence) కోసం రూ.5,000 రుసుము చెల్లించాలి.

రైతులకు అదనపు ఆదాయం : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం
రైతులకు అదనపు ఆదాయాన్ని అందించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించాల‌ని ఉద్దేశం కూడా ఉంద‌ని ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మీడియాతో గురువారం తెలిపారు. 

నిర్ణయాన్నితప్పుప‌ట్టిన బీజేపీ..
సూప‌ర్ మార్కెట్లలో వైన్ అమ్మేందుకు అనుమ‌తి ఇచ్చిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్ష బీజేపీ   (bjp) త‌ప్పుబ‌ట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం వినియోగాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించింది. మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ప‌డ్న‌వీస్ (ex cm devendra padnavees) ఈ విష‌యంలో స్పందించారు. “మహారాష్ట్రను మద్య రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతింబోము’’ అని అన్నారు. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ప్రభుత్వం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్నా.. రెండేళ్ల నుంచి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌హాయం చేయ‌లేదని ఆరోపించారు. కానీ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన్య‌త కేవ‌లం మ‌ద్యాన్ని ప్రోత్స‌హించ‌డం మాత్ర‌మే అని విమ‌ర్శించారు. 

click me!