
Firecrackers Ban : ప్రస్తుతం ఏ వేడుకలున్నా బాణాసంచా కాల్చడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఎంత ఎక్కువగా బాణాసంచా కాలిస్తే అంత ఘనంగా ఆ వేడుకల జరిగినట్లు భావిస్తున్నారు... ఇది స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అందుకే పండగలకే కాదు భర్త్ డే పార్టీలు, పెళ్లీ పేరంటాలు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, క్రికెట్ మ్యాచ్ గెలిస్తే, సినిమా రీలీజ్ లు... ఇలా అదిఇదని కాదు ఎప్పుడుపడితే అప్పుడు టపాసులు కాలుస్తున్నారు. దీనివల్ల వాయుకాలుష్యం పెరుగుతోందనే ఆందోళనను పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బాణాసంచా వినియోగంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
డిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బాణాసంచా వినియోగంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం కేవలం డిల్లీలోనే ఎందుకు బాణాసంచాలను వాడకూడదు? దేశవ్యాప్తంగా అవసరం లేదా? అని ప్రశ్నించింది. డిల్లీలోని వారికే స్వచ్చమైన గాలి కావాలా? దేశ ప్రజలందరికి వద్దా? అని నిలదీసింది. కేవలం డిల్లీ ప్రజలే కాదు భారతీయులంతా స్వచ్చమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని న్యాయస్థానం పేర్కొంది.
దేశంలెని చాలాప్రాంతాలు డిల్లీలో మాదిరిగానే కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి... కాబట్టి అక్కడ ఇక్కడని కాదు బాణాసంచాపై నియంత్రణ అన్నిచోట్ల ఒకేలా ఉండాలని జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. కేవలం డిల్లీలో మాత్రమే బాణాసంచాలపై నిషేధం విధించలేం... విధించాల్సి వస్తే దేశమంతటా విధిస్తామనేలా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా డిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.