
Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కు సంబంధించి ఒక వార్త తమిళనాడులో జోరుగా ప్రచారమవుతోంది. ఆయనకు గవర్నర్ పదవి దక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన రజినీకాంత్.. తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సహా కొందరు రాజకీయ నేతలను కలిశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి రజనీ ఆశీస్సులు తీసుకోవడం పెను దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులోని పలువురు నేతలను కలవడంతో ఆయనకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తాజాగా రజినీకాంత్ సోదరుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రజినీ సోదరుడు సత్యనారాయణ రావు ఏమన్నారంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారంటూ కొంతకాలంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూరే విధంగా ఇటీవల ఆయన చేసిన ప్రయాణాలు, వివిధ రాజకీయ నేపథ్యం కలిగిన వారిని కలవడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు ఆదివారం మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మీనాక్షి అమ్మన్ ఆలయంలో స్వామి దర్శనం అనంతరం మీడియాతో ఆయన సమావేశమయ్యారు. అప్పుడు రజనీకి రాజకీయ పదవి గురించి మీడియా ప్రశ్నించగా, వెంటనే రజనీ రాజకీయాల్లోకి రానని చెప్పారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రారు అంటూనే గవర్నర్ పదవి భగవంతుడి చేతుల్లో ఉందని అన్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి రానని చెప్పిన రజినీకాంత్ మాటలను గుర్తు చేస్తూ.. ఆయన రాజకీయాల్లో చేరబోరని స్పష్టం చేశారు. ఇటీవల పలువురు రాజకీయ నాయకులను కలవడం గురించి ప్రస్తావిస్తూ.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రజనీ భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సత్యనారాయణ రావు తెలిపారు. రజినీకి గవర్నర్ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామని ఆయన చెప్పారు.
రజినీ సైతం గవర్నర్ పదవి ఆఫర్ ను తిరస్కరించరని ఆయన చెప్పారు. ఇటీవల పలువురు రాజకీయ నేతలను కలవడం, సత్యనారాయణ రావు వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో ఇదే టాక్ వినిపిస్తుండటం రజినీకి గవర్నర్ పదవి దక్కనుందనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతోంది !