బీజేపీని ఇంటికి పంపించే వరకు నిద్రపోబోమని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తుఫాన్ వచ్చినప్పుడూ తమిళనాడుకు రాని ప్రధాని మోడీ.. ఎన్నికలు రాగానే తరుచూ వస్తున్నారని ఫైర్ అయ్యారు.
Udhayanidhi Stalin: తమిళనాడు క్రీడా శాఖ మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మంగళవారం బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని, మోడీని ఇంటికి పంపే వరకు డీఎంకే పార్టీ నిద్రపోదని స్పష్టం చేశారు.
‘డీఎంకే నిద్రపోలేకపోతున్నదని ప్రధాని మోడీ అన్నారు. ఔను, మిమ్మల్ని ఇంటికి పంపే వరకు మేం నిద్రపోం. బీజేపీని ఇంటికి పంపే వరకు మేం నిద్రపోం. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 450, అదే ఇప్పుడు రూ. 1200. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ప్రధాని మోడీ డ్రామాలు వేస్తున్నారు. రూ. 100 తగ్గించారు. మళ్లీ ఎన్నికలు ముగియగానే సిలిండర్ ధర వారు రూ. 500 వరకు పెంచుతారు’ ఉదయనిధి స్టాలిన్ తిరువన్నమలై జిల్లాలో నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
మిచాంగ్ తుఫాన్ సందర్భంలో ప్రధాని మోడీ ఒక్క సారి కూడా తమిళనాడులో పర్యటించలేదని అన్నారు. కానీ, ఎన్నికలు దగ్గరపడగానే తరుచూ రాష్ట్రానికి వస్తున్నారని ఫైర్ అయ్యారు. తుఫాన్ నష్టం నుంచి కోరుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఫండ్స్ అడిగారని గుర్తు చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. వచ్చే 22 రోజుల్లో డీఎంకే పార్టీ క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్లుతుందని, డీఎంకే గెలుపునకు బాధ్యత వహిస్తుందని వివరించారు.
జూన్ 3వ తేదీన కలైంజ్ఞర్ జయంతి అని గుర్తు చేస్తూ ఫలితాలు వెలువడే 4వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలో నుంచి 40 సీట్లను గెలుచుకుని గిఫ్ట్ ఇద్దామని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.