సైనికుల త్యాగాలు వృథాపోనీయము: ఎయిర్ ఫోర్స్ చీఫ్

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 9:35 AM IST
Highlights

భారతదేశం శాంతికాముఖదేశమని శాంతిని పరిరక్షించడానికి ఎంతదూరమన్న వెళ్తామని, అలాగే సైనికుల ప్రాణత్యాగాన్ని కూడా వృధాగా పోనీయమని ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదోరియా అన్నారు.

గాల్వాన్ లోయలో అమరులైన సైనికుల ప్రాణత్యాగాన్ని వృధాగా పోనీయమని ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదోరియా అన్నారు. భారతదేశం శాంతికాముఖదేశమని శాంతిని పరిరక్షించడానికి ఎంతదూరమన్న వెళ్తామని, అలాగే సైనికుల ప్రాణత్యాగాన్ని కూడా వృధాగా పోనీయమని అన్నారు. 

హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పస్సింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలను చేసారు. సవాళ్లతో కూడుకున్న వాతావరణంలో, అననుకూలమైన ప్రాంతాల్లో భారతీయ సైనికులు దేశాన్ని రక్షించడానికి ఎలా కంకణబద్ధులై ఉన్నారో నిరూపించారని, వారి పోరాటం అందరికి స్ఫూర్తి అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 

భారతదేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సన్నద్ధంగా, సంసిద్ధంగా ఉండాలని, లదాకా లో తలెత్తిన సమస్య అతి తక్కువ కాలంలో సవాలు ఎదురైత్ ఎలా ప్రతిస్పందించాలి చెప్పే చిన్న ఉదాహరణ అని వాయు సేన చీఫ్ అభిప్రాయపడ్డారు. 

ఒప్పందాలు, చర్చల తరువాత కూడా సైనికులను బలితీసుకున్న చైనా దళాల  ఆకృత్యాలు క్షమించరానివే అయినప్పటికీ.... సరిహద్దు వెంట శాంతిని నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని వాయుసేన చీఫ్ అన్నారు. 

ఇప్పటికే సరిహద్దు వెంట భారత వాయుసేన భారీగా విమానాలను మోహరించింది. అపాచీ హెలీకాఫ్టర్లను, మిగ్, జాగ్వర్,సుఖోయ్ యుద్ధ విమానాలను లడఖ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేసుల్లో మోహరించింది. 

ఇకపోతే... భారత సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గాల్వాన్‌లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన ఏ ఒక్క పోస్టునూ చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న ప్రధాని.. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని తెలిపారు.

చైనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన మోడీ.. భారత్ శాంతి కోరుకుంటోందని, కానీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా.. ఈ అఖిలపక్ష సమావేశంలో 20 మంది పార్టీ నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఘర్షణలకు ముందు, తర్వాత పరిస్థితిని ఆయన వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

click me!