ఆమెను ఎప్పటికీ క్షమించను: సాధ్వి ప్రజ్ఞాసింగ్ పై మోదీ ఫైర్

By Nagaraju penumalaFirst Published May 17, 2019, 4:27 PM IST
Highlights

 మోదీ ప్రజ్ఞాసింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజ్ఞా వ్యాఖ్యలు బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధమని, ఆమె వ్యాఖ్యలు బీజేపీకి సంబంధం లేదన్నారు. అది ఆమె సొంత అభిప్రాయం అంటూ బీజేపీ స్పష్టం చేసింది. ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ డిసిప్లనరీ కమిటీకి సూచించినట్లు బీజేపీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ: బీజేపీ నేత, భోపాల్ లోక్ సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీ సైతం ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూను అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని హెచ్చరించారు. 

ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మోదీ ప్రజ్ఞాసింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజ్ఞా వ్యాఖ్యలు బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధమని, ఆమె వ్యాఖ్యలు బీజేపీకి సంబంధం లేదన్నారు. అది ఆమె సొంత అభిప్రాయం అంటూ బీజేపీ స్పష్టం చేసింది. 

ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ డిసిప్లనరీ కమిటీకి సూచించినట్లు బీజేపీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇకపోతే స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది హిందువే, ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే అని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. 

అయితే కమల్‌ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ ని ఓ విలేకరి ప్రశ్నించగా నాథూరాం గాడ్సే గొప్ప దేశ భక్తుడు. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో అలాంటివారికి దీటైన జవాబు చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. 

ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు బీజేపీ సైతం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకుంది. చివరికి అవి ఆమె వ్యక్తిగతమంటూ బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ రాజకీయ దుమారం మాత్రం ఆగడం లేదు. 

click me!