ప్రతి గ్రామానికి స్కూల్.. జిల్లాకో హాస్పిటల్ నిర్మిస్తాం.. ఒక్క చాన్స్ ఇవ్వండి: గుజరాత్‌లో కేజ్రీవాల్

By Mahesh KFirst Published Oct 1, 2022, 7:27 PM IST
Highlights

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు గుజరాత్‌లో మాట్లాడారు. ప్రతి గ్రామానికి ఒక స్కూల్ నిర్మిస్తామని, జిల్లాకు ఒక హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం తమకు ఒకసారి చాన్స్ ఇవ్వాలని కోరారు.

అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు గుజరాత్ ప్రజలను కోరారు. తమకు అధికారం ఇస్తే.. ప్రతి గ్రామంలో ఒక స్కూల్ నిర్మిస్తామని, జిల్లాకో హాస్పిటల్ తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. కచ్ జిల్లాలో ప్రతి చోటికి నర్మదా నది నీటిని తీసుకెళతామని తెలిపారు. 

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు గుజరాత్ పర్యటనలో ఉన్నారు. వారు కచ్ జిల్లాలోని గాంధీదామ్‌ పట్టణంలో మాట్లాడారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పేద కుటుంబాల విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందారని, మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలను బీదరికం నుంచి బయట వేస్తున్నారని వివరించారు.కానీ, గుజరాత్‌లోని కచ్‌లో ప్రభుత్వమే స్వయంగా పాఠశాలలు మూసేస్తున్నారని తనకు తెలిసిందని రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో స్కూల్ నిర్మిస్తామని, 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక్కో హాస్పిటల్‌ను నిర్మిస్తామని కేజ్రీవాల్ అన్నారు. ఈ హాస్పిటల్‌లలో ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రజలకు అందుతుందని వివరించారు.

ఆప్ అధికారంలోని పంజాబ్, ఢిల్లీల్లో జీరో ఎలక్ట్రిసిటీ బిల్లు విధానం ఉన్నదని, అక్కడ పేద ప్రజలపై కరెంట్ బిల్లు భారాన్ని తొలగించామని చెప్పారు. ఇక్కడ కూడా విద్యుత్ బిల్లును లేకుండా చేస్తామంటే.. బీజేపీ నేతలు తననే దూషిస్తున్నారని వివరించారు. మార్చి 1వ తేదీన తాము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గుజరాత్ ప్రజలు కూడా జీరో ఎలక్ట్రిసిటీ బిల్లు పొందుతారని హామీ ఇచ్చారు. 

ఢిల్లీ ప్రభుత్వం ఓ బ్రిడ్జీ నిర్మాణం రూ. 150 కోట్లు సేవ్ చేసిందని, వాటిని ప్రజలకు ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. అది రెవ్డీనా? అని ప్రశ్నించారు. అలాగైతే తాను ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. మరి బ్యాంకు అకౌంట్‌లలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని హామీని ఏం అంటామని వివరించారు.

click me!