
బెంగళూరు : ఓ మహిళ వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో వెలుగు చూసింది. పిన్ని కొడుకుతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను అడ్డు తొలగించుకోవడానికి రౌడీషీటర్లకు సుపారీ ఇచ్చింది. రూ. ఐదు లక్షల సుపారీ ఇచ్చిమరీ వారితో బేరం మాట్లాడింది. దాని ప్రకారం వారు ఆ భర్తను హత మార్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా, కణిగల్ తాలూకా, సీనప్పనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన మంజునాథ్ హత్యకు గురయ్యాడు. మంజునాథ్ భార్య హర్షిత(20) ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఈ కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు హర్షితను.. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న పిన్ని కొడుకు రఘును, రఘు ఫ్రెండ్ రవికిరణ్ లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలియజేశారు. ఫిబ్రవరి 3వ తేదీన మంజునాథ్ కుణిగల్ పట్టణంలో స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే వేడుకలో పాల్గొన్నాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. కాగా, అతను పడుకున్న కాసేపటికి అర్ధరాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ మంజునాథ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి రాలేదు. సీనప్ప హళ్లి గ్రామంలోని తన సొంత ఇంటి నుంచి అలా వెళ్ళిన అతను అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్నమంగళ చెరువులో శవంగా కనిపించాడు.
వాలంటైన్స్ డే రోజున విషాదం.. బీచ్‌కు వెళ్లిన జంట నీటిలో మునిగి మృతి..
మంజునాథ్ కనిపించకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు అతడు శవమై దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య హర్షితను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమె చెప్పిన వివరాలతో ఆమెతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మంజునాథను భార్య హత్య చేయించిందని గ్రామస్తులు కూడా చెబుతున్నారు. వీరి పథకం ప్రకారం రఘు, రవికిరణ్ లు ఆరోజు రాత్రి మంజునాథ్ కు ఫోన్ చేయించి.. చెరువు వద్దకు వచ్చేలా చేశారు. అక్కడికి వచ్చిన మంజునాథ్ ను హత్య చేసి.. చెరువులో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ మేరకు నిందితులు నేరం ఒప్పుకున్నారు. కేసు విచారణలో ఉంది.