
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ధరల పెరుగుదల అంశంపై రచ్చ రచ్చ జరుగుతున్నది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. తీవ్ర నిరసనలూ చేశాయి. దీనిపై చర్చించడానికి ఇరువర్గాలు సిద్ధం అయ్యాయి. ధరల పెరుగుదల పై ఈ రోజు జరిగిన చర్చల్లో ఓ కీలక పరిణామం పార్లమెంటులో చోటుచేసుకుంది.
లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పచ్చి వంకాయ తిని ఓ వివరణ ఇచ్చింది. ఆమె ధరల పెరుగుదల అంశంపై మాట్లాడటానికి లేచి నిలబడింది. అందరు చూస్తుండగా ఆమె ఎవరూ ఊహించని విధంగా ఓ వంకాయను తీసింది. అందరికీ చూపెట్టింది. ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించిన స్పీకర్‌కు ధన్యవాదాలు అని పేర్కొంది.
ఆ వంకాయను చేతిలోకి తీసుకుని నోటిలో పెట్టుకుంది. ఆ పచ్చి వంకాయనే కొరికేసింది. గ్యాస్ ధరల పెరుగుదలతో తాము వంట చేసుకోలేకున్నామని ఆమె చెప్పాలనుకుంది. ఇలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. తాము ఈ కూరగాయలను వండుకుని తినాలా? లేక పచ్చివే తినాలా? అనే ప్రశ్నను ఆమె ప్రభుత్వానికి ప్రదర్శనతో చూపించింది.
కేంద్ర ప్రభుత్వం తమను పచ్చి వంకాయలనే తినాలని భావిస్తున్నదా? అని ఆమె అడిగింది. ఇలా అంటూనే ఆమె వంకాయను కొరికేసింది. కుకింగ్ గ్యాస్ ధర విపరీతంగా పెరగడం మూలంగా పేదలు ఇలా పచ్చి కూరగాయలనే తినే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం నెట్టేసిందని పేర్కొంది.
ఎల్పీజీ సిలిండర్ ధర గత కొన్ని నెలల్లోనూ నాలుగు సార్లు పెరిగిందని ఆ తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తెలిపింది. రూ. 600 నుంచి ఈ ధర ఇప్పుడు రూ. 1,100కు పెరిగిందని వివరించింది. అందుకే సిలిండర్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.