2019 లో మొదలైన కరోనా భయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మహమ్మారి మానవ జీవితాలతో ఆడుకుంటూనే వుంటోంది.
హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. గత మూడునాలుగేళ్ళుగా ఈ వైరస్ అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిపై దాడి చేస్తూనే వుంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలితీసుకుని... ఇంకా అనేకుల జీవితాలను చిన్నాబిన్నం చేసిన ఈ కరోనా తాజాగా మరో రూపాన్ని దాల్చింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం కొత్త సంవత్సర వేడుకలకు సిద్దమవుతున్న వేళ కోవిడ్ 19 న్యూ వేరియంట్ జెఎన్.1 విజృంభిస్తోంది. గత నాలుగేళ్లుగా ఇలాగే కొత్త సంవత్సరానికి ముందు కొత్త కొత్త రూపాల్లో కరోనా మానవాళిపై దాడి చేస్తోంది.
2019 చివరో సరిగ్గా ఇలాగే ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలకు సిద్దమవుతుండగా చైనాలో భయంకరమైన వైరస్ వ్యాప్తి మొదలయ్యింది. ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ ప్రాణాంతకమైన కోవిడ్ 19 ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పుడు కూడా 2023 కు స్వస్తిపలికి 2014 లోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతుండగా కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతోంది.
ఇప్పటికే ఈ కరోనా న్యూ వేరియంట్ తో పెద్దగా ప్రమాదమేమీ లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కానీ ఇది చాలా వేగంగా వ్యాప్తిచెందుతూ మళ్లీ కరోనా మొదటి వేవ్ పరిస్థితులను సృష్టించేలా కనిపిస్తోంది. ఇటీవల ఇండియాలో ఈ న్యూ వేరియంట్ కేసులు బయటపడగా మెళ్లిమెళ్లిగా వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తోంది.
Also Read కరోనా జేఎన్.1 వైరస్ కేసులు: అదనపు వ్యాక్సిన్ అవసరమా?
2019 చివర్లో మొదటిసారిగా చైనాలో కరోనా వ్యాప్తి మొదలయ్యింది. 2020 డిసెంబర్ లో ఇదికాస్త ఆల్ఫా, బీటా, గామా గా రూపాంతరం చెందింది. ఇక 2021 చివరికి ఒమిక్రాన్ గా మారి ప్రజలపై దాడిచేసింది. 2022 లో కూడా కరోనా వేరియంట్స్ బయటపడ్డా అవి పెద్దగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపించలేవు. కానీ 2023 డిసెంబర్ కు వచ్చేసరికి జెఎన్.1 రూపంలో మరోసారి ప్రజలకు విరుచుకుపడేందుకు కరోనా మహమ్మారి సిద్దమయ్యింది.
అయితే డిసెంబర్ లోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా వుండేందుకు గల కారణాలను కొన్ని సర్వేలు బయటపెట్టాయి. వాతావరణ ప్రభావం ఈ వైరస్ ఎక్కువగా వుంటుందని... శీతాకాలంలో చల్లటి గాలులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా వుంటాయని చెబుతున్నాయి. వేడి వాతావరణంలో కరోనా వైరస్ జీవించలేదు కాబట్టి వేసవిలో వైరస్ వ్యాప్తి కనిపించదని చెబుతున్నారు. వేసవి ముగియగానే వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి... ఇది చలికాలం నాటికి మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి డిసెంబర్ లో అంటే కొత్త సంవత్సరం ముందు వైరస్ వ్యాప్తి ఎక్కువగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయి.
చైనాకు చెందిన సిచుయాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా ఇదే చెబుతోంది. చల్లటి వాతావరణ పరిస్థితుల్లో వుండేవారు ఎక్కువగా కరోనాబారిన పడే అవకాశాలు ఎక్కువగా వుంటాయని... వేడి వాతావరణ పరిస్థితుల్లో జీవించేవారికి ఈ కరోనా రిస్క్ తక్కువగా వుంటుందని తేల్చారు.