
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఇంకా షెడ్యూల్ వెలువరించాల్సి ఉన్నది. కానీ, రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. తదుపరి రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేంద్రంలో, రాష్ట్రాల్లోని ప్రభుత్వాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగించే ధోరణి మొదలైంది. ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ క్యాండిడేట్‌ను తెరమీదకు తెచ్చి గెలిపించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే, అందులోనూ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తుంటాయి.
2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అందరినీ ఆశ్చర్యంలోకి నెడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం పేరును ప్రకటించారు. ముస్లిం అభ్యర్థిని ప్రకటించడంతో కొన్ని ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. 2012 ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీని యూపీఏ ప్రభుత్వం నామినేట్ చేస్తే.. ఆయనకూ కొన్ని యూపీఏయేతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.
ముఖ్యంగా 2014 నుంచి బీజేపీ ఎంచుకునే అభ్యర్థులు అనూహ్యంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రులైనా, గవర్నర్లు అయినా, రాజ్యసభ అభ్యర్థులైనా సరే సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్నది. ఈ సారి కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఈ ధోరణులతో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవారు కూడా గోప్యతను పాటిస్తుండట గమనార్హం.
గత చరిత్రన గమనిస్తే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత అదే పార్టీ అధికారంలో కొనసాగితే.. తదుపరి హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆ ఉపరాష్ట్రపతినే బరిలోకి దింపి గెలిపించుకున్న దాఖలాలు ఉన్నాయి. బీజేపీ నామినీగా ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆయనే ఉపరాష్ట్రపతి.
సాధారణంగా కేంద్రంలోని ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. అయితే, ప్రతిపక్షాలు కూడా పోటీని ప్రదర్శించడానికి తమ అభ్యర్థిని నిలబెడతారు. ఈ సారి కేంద్రంలోని బీజేపీకి ఉన్న బలం రాష్ట్రపతిని స్వయంగా ఎన్నుకోవడానికి సరిపోదు. కాబట్టి, వైసీపీ, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టల అవసరం ఏర్పడింది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో బీజేపీకి ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొనడంతో కేసీఆర్ మద్దతును బీజేపీ పొందే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో బీజేపీ ఓ ముస్లిం నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. జమ్ము కశ్మీర్ నుంచి గులాం నబీ ఆజాద్‌ను లేదా చాలా విషయాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. గులాం నబీ ఆజాద్‌ను ప్రకటిస్తే.. విపక్షాల నుంచి కూడా ఓట్లు పడతాయి.
కాగా, దక్షిణాదిలో బీజేపీ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నది. కాబట్టి, దక్షిణాది నేతనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలోనే బీజేపీ ఉంటే.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడినే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ. లేని యెడల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌న ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అభిప్రాయాలు వస్తున్నాయి. వీరితోపాటు గిరిజన నేత లేదా గిరిజన మహిళా నేతనూ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.