పంజాబ్‌లాగే గుజరాత్‌లోనూ.. మీకు ఎవరు సీఎం కావాలి?’ ప్రజలను అడిగిన అరవింద్ కేజ్రీవాల్

By Mahesh KFirst Published Oct 29, 2022, 2:04 PM IST
Highlights

గుజరాత్‌ తదుపరి సీఎంగా ఎవరు ఉండాలి? అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్ర ప్రజలను అడిగారు. తమ అభిప్రాయాలను తనకు తెలియజేయాలని ఓ నెంబర్, ఈమెయిల్ ఐడీలను ప్రకటించారు. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే సీఎంగా నియమిస్తామని వివరించారు.
 

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలోనే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని పొందింది. ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ వినూత్న విధానాన్ని పాటించారు. అక్కడ ఆటో డ్రైవర్లతో భేటీ కావడం, వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం వంటివి చేశారు. అలాగే, ప్రజలు కోరుకున్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని వివరించారు. ఇందుకోసం పంజాబ్‌లోనూ ఓ సర్వే పెట్టారు. అందులో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని, అందుకు అనుగుణంగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు. సర్వే ఆధారంగానే పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు తెలిపారు. అనంతరం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత భగవంత్ సింగ్ మాన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదే వ్యూహాన్ని ఆయన ఇప్పుడు గుజరాత్‌లోనూ అమలు చేస్తున్నారు.

శనివారం ఉదయం ఓ విలేకరుల సమావేశంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటనే చేశారు. ‘గుజరాత్‌కు ఎవరు తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాలు తెలుపండి’ అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను 6357000360 నెంబర్‌పై రిజిస్టర్ చేయాలని కోరారు. ప్రజలు ఈ నెంబర్‌కు వాయిస్ మెస్సేజీ పంపవచ్చని, వాట్సాప్ మెస్సేజీలు, సాధారణ మెస్సెజీలనూ నవంబర్ 3వ తేదీలోపు పంపవచ్చని వివరించారు. ఆ సర్వే ఫలితాన్ని నవంబర్ 4వ తేదీన ప్రకటిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన ఒక ఈమెయిల్‌నూ ప్రకటించారు. ఆ ఈమెయిల్‌లో ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చని వివరించారు.

Also Read: Gujarat election 2022: ప్ర‌తి ఇంటికి నెల‌కు రూ.30,000 ప్ర‌యోజ‌నాలు.. : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

ఈ సందర్భంగా అధికారంలోని బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీకి వచ్చే ఐదేళ్ల కోసం ఎలాంటి ప్రణాళిక లేదని వివరించారు. గుజరాత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం దారుణంగా ఉన్నదని తెలిపారు. ఏడాది క్రితం బీజేపీ గుజరాత్‌లో సీఎంను మార్చిందని గుర్తు చేశారు. అప్పుడు విజయ్ రూపానీని మార్చి ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ను నియమించిందని అన్నారు. కానీ, అప్పుడు ప్రజల అభిప్రాయం ఏదీ తీసుకోలేదని వివరించారు. కానీ, ఆప్ అలా చేయదని చెప్పారు. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని అడుగుతుందని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తుందని వివరించారు.

click me!