కరోనా కట్టడి.. అతిపెద్ద మురికివాడపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

By telugu news teamFirst Published Jul 11, 2020, 9:53 AM IST
Highlights

క‌రోనా వ్యాప్తి ఎంత విస్త‌ర‌ణ ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టికీ, దానిని నియంత్రణలోకి తీసుకురాగలమ‌న‌డానికి ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావిలు ఉదాహ‌ర‌ణలు‌గా నిలిచాయ‌న్నారు. 
 

ముంబైలోని అతిపెద్ద మురికివాడ ప్రాంతమైన ధారావిలో కరోనా వైరస్ బ్రేక్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. ధారావిలో కరోనా వైరస్‌ను అరికట్టడానికి చేసిన ప్రయత్నాల కార‌ణంగా ఈ ప్రాంతంలో కరోనా నుంచి విముక్తి పొందే దిశలో ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

వైరస్ ఎంతగా చెలరేగిపోయినా అడ్డుకట్ట వేయగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్ మాట్లాడుతూ...క‌రోనా వ్యాప్తి ఎంత విస్త‌ర‌ణ ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టికీ, దానిని నియంత్రణలోకి తీసుకురాగలమ‌న‌డానికి ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావిలు ఉదాహ‌ర‌ణలు‌గా నిలిచాయ‌న్నారు. 

క‌రోనా టెస్టులు ముమ్మరంగా నిర్వ‌హించ‌డంతో పాటు, సామాజిక దూరం పాటి‌స్తూ, వ్యాధి సోకిన రోగులకు తక్షణ చికిత్స అందిస్తున్న కారణంగా కరోనా యుద్ధంలో ముంబైలోని ధారావి మురికివాడ విజయం సాధించింద‌ని అన్నారు. 

లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపుల కార‌ణంగా కేసులు పెరుగుతున్నాయ‌ని, వీటిని ప్ర‌జాభాగ‌స్వామ్యం, సంఘీభావంతో అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. కాగా ధారావిలో ప్రస్తుతం 166 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 1,952 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని బీఎంసీ అధికారి ఒక‌రు తెలిపారు.
 

click me!