గన్ పట్టుకున్నోళ్లకు గన్‌తోనే సమాధానం చెప్పాలి.. మావోయిస్టులు, తీవ్రవాదులతో చర్చల్లేవ్: తమిళనాడు గవర్నర్

Published : Aug 01, 2022, 12:55 PM IST
గన్ పట్టుకున్నోళ్లకు గన్‌తోనే సమాధానం చెప్పాలి.. మావోయిస్టులు, తీవ్రవాదులతో చర్చల్లేవ్: తమిళనాడు గవర్నర్

సారాంశం

గన్ పట్టుకున్నోళ్లకు గన్‌తోనే సమాధానం చెప్పాలని, దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడేవారితో చర్చలు అనవసరం అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అందుకే గడిచిన 8 ఏళ్లలో మావోయిస్టులు, తీవ్రవాదులతో చర్చలు లేవని వివరించారు.  

కొచ్చి: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు, మావోయిస్టులతో చర్చలు జరపడం అనవసరం అని అన్నారు. గన్ పట్టుకున్నవారికి గన్‌తోనే సమాధానం చెప్పాలని అభిప్రాయపడ్డారు. అదే సందర్భంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై విమర్శలు గుప్పించారు. కొచ్చిలో వర్తమాన అంతర్గత భద్రత సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సెషన్‌లో మాట్లాడారు.

26/11 ముంబయి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు దేశమంతా ఆందోళనలో మునిగిపోయిందని అన్నారు. కొందరు టెర్రరిస్టులు మూలంగా దేశం అవమానపడిందని తెలిపారు. అలాంటి ఘటన జరిగిన 9 నెలలకే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. పాకిస్తాన్ ప్రధానితో ఓ ఒప్పంద పత్రాన్ని 2008లో విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ రెండు దేశాల ప్రధానులు టెర్రరిజానికి బాధితులేనని పేర్కొంటూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారని తెలిపారు.

‘మనం శత్రువుల నుంచి బోధనలు వింటామా? అసలు పాకిస్తాన్ మనకు మిత్రదేశమా.. శత్రుదేశమా? ఇది ముందు స్పష్టం కావాలి. అది స్పష్టం కాలేనంతకాలం కన్ఫ్యూజన్‌లోనే ఉంటాం’ అని చెప్పారు. 2008లో పది మంది లష్కర్ తీవ్రవాదులు కాల్పులు, బాంబు దాడులతో బీభత్సం సృష్టించారు. ఇందులో 174 మంది మరణించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి కాలం కంటే నేడు దేశ భద్రత బాగుందని గవర్నర్ ఆర్ఎన్ రవి అభిప్రాయపడ్డారు. మన్మోహన్ సింగ్ హయాంలో అంతర్గత భద్రతకు ముప్పుగా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. అప్పుడు వారు 185 జిల్లాలకు వ్యాపించారని, ప్రజలు రెడ్ కారిడార్ అని కూడా మాట్లాడేవారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు వారు 8 జిల్లాల కంటే తక్కువే కుదించుకుపోయారని వివరించారు.

కశ్మీర్ గురించి ఆయన మాట్లాడుతూ, హింసను ఉపేక్షించేది లేదన్నారు. గన్ పట్టుకున్నవారికి గన్‌తోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారితో చర్చలు జరపాల్సిన అవసరం లేదని చెప్పారు. గడిచిన 8 ఏళ్లలో ఒక్క ఉగ్రవాద సంస్థతోనూ చర్చలు జరగలేవని గుర్తు చేశారు. ఏదైనా జరిగితే.. అవి కేవలం లొంగిపోవడానికి సంబంధించినవి మాత్రమేనని తెలిపారు.

జమ్ము కశ్మీర్ లోయలో వేలాది మంది చంపేసేవారని, జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ ఢిల్లీకి వచ్చి ప్రధానితో షేక్ హ్యాండ్ ఇచ్చేవారని అన్నారు. ఈశాన్య భారతంలోనూ వందలాది మందిని చంపేసినవారితోనూ చర్చలు జరిపేవారని, హింసను ఆపేయాలని కోరేవారని తెలిపారు. కానీ, ఇప్పుడు అవేం లేవని వివరించారు. దేశ ఐక్యతను, సమగ్రతను వ్యతిరేకించేవారితో సంప్రదింపుల్లేవ్.. చర్చల్లేవని పేర్కొన్నారు. 

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఒక భావజాలం ఉండేదని అన్నారు. వారు రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారు కాదని తెలిపారు. కానీ, దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. కాబట్టి, మావోయిస్టులతో సంప్రదింపులు, చర్చలు అనే ప్రశ్నే లేదని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu