రైతాంగ ఉద్యమాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు...!!

By telugu news teamFirst Published Dec 7, 2020, 11:18 AM IST
Highlights

రైతు సమస్యలపై ఢీల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళన కోసం 31 రైతు సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రైతు నాయకులలో డాక్టర్ దర్శన్ పాల్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రైతు సంఘాలకు సమన్వయకర్త పాత్ర పోషిస్తున్నారు.

'సుర్జిత్ సింగ్ ఫూల్'.. ఢిల్లీ వేదికగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్లలో ఒకడు. సుదీర్ఘ కాలం రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తున్న ఆయన, 'క్రాంతికారీ కిసాన్ యూనియన్' (BKU Krantikari) లో కీలక నేత. వామపక్ష భావజాలంతో కొనసాగే ఈ సంఘం పంజాబ్ రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రుణ మాఫీ కోసం ఆ సంఘం సుదీర్ఘ కాలం పోరాడుతుంది. 

సుర్జిత్ సింగ్ ఫూల్ నాయకత్వంలో పంజాబ్ రైతాంగం సంఘటితం అవుతున్నారనే కారణంతో అతనిపై భారత ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు.

2009 లోనే అప్పటి పంజాబ్ ప్రభుత్వం  సుర్జిత్ సింగ్ ఫూల్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం- UAPA కేసును నమోదు చేసింది. 2009 నవంబర్ 9న అతను ఒక కేసు విషయమై బటిండా జిల్లా లోని ఫుల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు హాజరై వస్తుంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అతన్ని ఎత్తుకెళ్లారు. మరో రైతు నాయకుడు, కోర్టు ప్రాంగణంలో ఉన్న ఇతర లాయర్లు, ప్రజాస్వామిక వాదులు ఇది గమనించి తక్షణమే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు చూపారు.

మావోయిస్ట్ పార్టీ సభ్యుడు అని, కోబాడ్ గాంధీకి ముఖ్య అనుచరుడు అని, పంజాబ్ రైతాంగాన్ని సాయుధపోరాటానికి సన్నద్ధం చేస్తున్నాడని, అందుకు యువకులను సమీకరిస్తున్నాడని తప్పుడు ఆరోపణలు సృష్టించి పంజాబ్ గ్వాటమాలగా పిలవబడుతున్న అమృత్సర్‌లోని ఉమ్మడి జైలులో "ఇంటెన్సివ్ ఇంటరాగేషన్" కింద ఉంచి చిత్రహింసలు పెట్టారు. 

తొడలపైన, చెవుల్లో కరెంట్ షాక్ ఇస్తూ, తల భాగాన్ని నీళ్లలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి, కాళ్ళు చేతులు పట్టుకొని లాగుతూ హింసించడమే కాకుండా రెండు రోజులపాటు అలాగే నిలబడి ఉండాలి అని కొట్టడంతో తలకు10 కుట్లు వేయాల్సి వచ్చిందని అతను మీడియాకు తెలిపాడు.

సుర్జిత్ సింగ్ ఫూల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించడంతో 'మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు' అనే కారణంతో మూడు నెలల తర్వాత  సుర్జిత్ సింగ్ ఫుల్ కు 2010 ఫిబ్రవరి 10 న బెయిల్ మంజూరు చేశారు. కానీ అక్రమంగా అతన్ని చిత్రహింసలకు గురిచేసిన వాళ్లపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

రైతాంగ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వాళ్లలో   సుర్జిత్ సింగ్ ఫుల్ అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరని ఇవాళ మీడియా రాస్తుంది. విన్నూత రీతిలో నిరసనలు చేపట్టడంలో క్రాంతికారీ కిసాన్ యూనియన్ పెట్టింది పేరు. 31 సంఘాలను సంఘటిత పరచడంలో కూడా ఈ సంఘం ముఖ్య భూమిక పోషించింది.

ఇవాళ ఈ సంఘానికి డాక్టర్ దర్శన్ పాల్ అధ్యక్షుడుగా ఉన్నాడు. స్వతహాగా వైద్యుడైన (అనస్థీషియాలో ఎండీ) డాక్టర్ దర్శన్ పాల్ 2002 లో పంజాబ్ సివిల్ మెడికల్ సర్వీసులో తన ఉద్యోగాన్ని వదిలి, తన కుటుంబానికి చెందిన 15 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ రైతు సమస్యలపై పనిచేస్తున్నాడు.  2016 లో క్రాంతికారి కిసాన్ యూనియన్‌లో చేరడానికి ముందు BKU యొక్క కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు, ఈ సంవత్సరం దాని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

రైతు సమస్యలపై ఢీల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళన కోసం 31 రైతు సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రైతు నాయకులలో డాక్టర్ దర్శన్ పాల్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రైతు సంఘాలకు సమన్వయకర్త పాత్ర పోషిస్తున్నారు.

రైతు నాయకుల పైన కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం- నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటే ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

click me!