
CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. ఢిల్లీ లో ఆదివారం సాయంత్రం జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పార్లమెంట్ వర్షాకాల సమావేశం మొదటి రోజే అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది.
ఎన్డీఏ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నడ్డా, రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చలు జరుపుతామనీ, విపక్ష మద్దతు లభిస్తే ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
సీపీ రాధాకృష్ణన్ 2024 జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన రెండు సార్లు తమిళనాడు కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
16 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన రాధాకృష్ణన్ తనను “ఆర్ఎస్ఎస్ కేడర్”గా గర్వంగా అభివర్ణించారు. జార్ఖండ్‌లో గవర్నర్‌గా ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే, సంస్కృతిని కాపాడటంపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2023లో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ మార్గాన్ని ఎంచుకున్న వారు తాము చేసిన పనుల వల్లే నశిస్తారని వ్యాఖ్యానించారు.