రేపటి భారత్ బంద్‌కు మద్ధతిస్తున్న పార్టీలు ఇవే

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 4:30 PM IST
Highlights

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు ఆ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది. 

అడ్డూ, అదుపు లేకుండా వరుస పెట్టి పెరిగిపోతున్న పెట్రో ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు మద్ధతు ప్రకటించగా... మిగిలిన రాష్ట్రాల్లోని పార్టీలు బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.

సోమవారం ఉదయం 9 గంటలకు బంద్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దీని వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.

ఈ బంద్‌కు జేడీఎస్, డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, నేషనల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్థతు ప్రకటించాయి. బంద్ కారణంగా ముందు జాగ్రత్తగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాయి.

మరోవైపు ఈ బంద్‌కు తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. సోమవారం ఎలాంటి సెలవు మంజూరు చేసేది లేదంటూ ప్రభుత్వోద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ వరద బీభత్సం దృష్ట్యా ముస్లిం లీగ్ భారత్‌ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Last Updated 9, Sep 2018, 5:33 PM IST