కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌వో మరోసారి షాక్.. అత్యవసర వినియోగ అనుమతి వాయిదా..

By telugu teamFirst Published Sep 28, 2021, 3:23 PM IST
Highlights

భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలిసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల ఇచ్చే నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది. అంతేకాదు, కొవాగ్జిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సంస్థకు సమర్పించాల్సిందిగా భారత్ బయోటెక్‌ను కోరినట్టు వివరించింది.

న్యూఢిల్లీ: దేశీయ టీకా కొవాగ్జిన్‌కు మరోసారి ఎదురుచూపులే నిలిచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న కొవాగ్జిన్ టీకా తయారీదారు భారత్ బయోటెక్‌ అభ్యర్థనపై డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం సకాలంలో వెలువడటం లేదు. తాజాగా, అత్యవసర వినియోగ అనుమతులు మరోసారి వాయిదా పడినట్టు సమాచారం తెలిసింది. ఈ అనుమతి ప్రక్రియను డబ్ల్యూహెచ్‌వో మరోసారి వాయిదా వేస్తున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. అంతేకాదు, కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మరింత డేటాను అందించాల్సిందిగా భారత్ బయోటెక్‌ను యూఎన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ కోరినట్టు వివరించాయి.

ఈ జాప్యం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం వేస్తున్నది. చాలా దేశాలు విదేశీయులను అనుమతించడానికి టీకా తప్పనిసరి నిబంధనగా అమలు చేస్తున్నాయి. ఆ టీకా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేరిన వ్యాక్సిన్ అయి ఉండాలనేది నిబంధన. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగ అనుమతులు పొందడానికి భారత్ బయోటెక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్ వేసుకుని విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేయాలని ప్రణాళికలు వేసుకున్న భారతీయ పౌరులకు ఇది ప్రతిబంధకంగా మారింది. కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేరినట్టయితే ఈ టీకా వేసుకున్నవారు విదేశాలకు వెళ్లడానికి వీలు కలుగుతుంది.

ఈ వ్యవహారంపై తాజాగా భారత్ బయోటెక్ కూడా స్పందించింది. ఒక బాధ్యత కలిగిన టీకా తయారీ సంస్థగా, ఇది వరకు ఈ అనుమతులు విజయవంతంగా పొందిన సంస్థగా డబ్ల్యూహెచ్‌వో అనుమతి ప్రక్రియపై కామెంట్ చేయాలని, లేదా వదంతలు వ్యాపించాలని భావించడం లేదని తెలిపింది. అయితే, అత్యవసర వినియోగ అనుమతులు పొందడానికి తాము డబ్ల్యూహెచ్‌వోతో అనుసంధానంలో ఉన్నామని వివరించింది. ఈ నెల చివరి వారంలో డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగ అనుమతులు పొందే అవకాశముందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా ఇటీవలే అభిప్రాయపడటం గమనార్హం.

click me!