
గువహతి: రుతుపవనాలు రాకకు ముందే ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వర్షం దంచి కొట్టాయి. అసోంలో చాలా ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. కనీసం తొమ్మిది మంది ఈ వరదల బీభత్సం కారణంగా మరణించారు. కాగా, 27 జిల్లాల్లో ఈ వరదలతో 6.6 లక్షల మంది ప్రభావితం చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను సమీక్షించడానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఆయన చర్య ఒకటి వివాదాస్పదం అయింది.
మోకాళ్ల లోతు కూడా లేని చోట కొద్ది దూరం వరకే అంటే బోటు వరకు వెళ్లడానికి ఆయన సాహసించలేదు. ఓ రెస్క్యూ సిబ్బంది సహకారం తీసుకున్నాడు. నీటి చుక్క అంటకుండా ఆ బోటు వరకు వెళ్లాలని ప్రయత్నించాడు. రెస్క్యూ వర్కర్ సిబ్బంది వీపుపై వంగి ఆయన మెడల చుట్టూ చేతులను అల్లుకుని బోటు వరకు రెస్క్యూ వర్కర్‌పై వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అవుతున్నది. చాలా మంది ఆ బీజేపీ ఎమ్మెల్యేను ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసిన ఈ వరదల పట్ల ఇన్సెన్సిటివ్‌గా బిహేవ్ చేశారని ఆ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు.
లుండింగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సిబు మిశ్రా హొజాయ్ జిల్లాలో వరదలను సమీక్షించడానికి వెళ్లాడు. అక్కడ కొంత ఎత్తు ఉన్న ప్రాంతంలోనే నిలబడి.. వరదలను సమీక్షించడానికి వెళ్లే బోటు వద్దకు ఓ రెస్క్యూ సిబ్బంది వీపుపై వెళ్లాడు. నిజానికి ఆ నీళ్లు కనీసం మోకాళ్లు మునిగే వరకు కూడా లేవు. అలాగనీ, ఆ బోటు కూడా చాలా దగ్గరగానే ఉన్నది. దీంతో చాలా మంది ఆ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.
అసోంలో వదరల కారణంగా సుమారు 48 వేల మందిని 248 సురక్షిత శిబిరాలకు తరలించారు. ఈ వరదల కారణంగా అసోంలో అత్యధిక నష్టం హొజాయ్, కాచార్ జిల్లాల్లోనే చోటుచేసుకుంది. ఈ రెండు జిల్లాల్లో కనీసం లక్ష మంది చొప్పున వరదలతో ప్రభావితం అయ్యారు. కాగా, దక్షిణ అసోంలోని దిమా హసావ్ జిల్లా వరదల కారణంగా మిగతా ప్రాంతంతో సంబంధాలు లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. ఐదు రోజులు గడిచిన మిగతా రాష్ట్రంలో ఈ జిల్లాకు రాకపోకలు లేకుండా పోయాయి.