24ఏళ్ల తర్వాత పని చేయని లిఫ్ట్ తొలగించి చూస్తే.. అస్థిపంజరంగా మారిన ఓ మృతదేహం

By telugu teamFirst Published Sep 6, 2021, 8:18 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌లో 24 ఏళ్ల నుంచి పనిచేయకుండా ఉన్న లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ లిఫ్ట్ కింద అస్థిపంజరంగా మారిన ఓ పురుషుడి మృతదేహం లభ్యమైంది. ఈ మిస్టరీని ఛేదించడంలో పోలీసులు రంగప్రవేశం చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ అవాంఛనీయ ఘటన వెలుగు చూసింది. బస్తి జిల్లా కైలీలోని ఒపెక్ హాస్పిటల్‌లో 24 ఏళ్లుగా పాడుబడి ఉన్న ఓ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో అస్థిపంజరంగా మారిన ఓ మృతదేం కనిపించింది. 24ఏళ్లుగా ఈ లిఫ్ట్‌ను వినియోగించడం లేదు. దీంతో ఆ వ్యక్తి మరణంపై ఎటువంటి సూచనలు కనిపించడం లేదు.

ఒపెక్ హాస్పిటల్‌ను 1991లో ప్రారంభించారు. 1997 దాకా ఈ లిఫ్ట్ పనిచేసింది. తర్వాత ఆ ఎలవేటర్ పనిచేయడంలేదు. ఈ కేసు పోలీసులకు పెద్ద మిస్టరీని తెచ్చిపెట్టింది. కేసును ఎలా పరిష్కరించాలా? అని ఆలోచిస్తున్న పోలీసులు 24ఏళ్ల క్రితం మిస్సింగ్ పర్సన్ కింద చేసిన ఫిర్యాదుల చిట్టాను పరిశీలిస్తున్నారు. ఆ మృతదేహం నుంచి శాంపిల్‌ను డీఎన్ఏ పరీక్షకూ పంపారు.

లిఫ్ట్ కింద పడి ఊపిరాడక ఆ వ్యక్తి చనిపోయాడా? లేక ఎవరైనా హతమార్చి ఎవరూ చూడకముందు మృతదేహాన్ని ఇక్కడ పడేశారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియడం లేదు. డీఎన్ఏ ఫలితాలు వచ్చిన తర్వాత కేసు పురోగతి సాధిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని బస్తి జిల్లా అదనపు ఎస్పీ దీపేంద్రనాత్ చౌదరి వివరించారు.

click me!