Taliban: రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఆఫ్ఘనిస్తాప్‌పై చర్చ!

By telugu teamFirst Published Sep 6, 2021, 7:36 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, నిర్మలా సీతారామన్‌లతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. తదుపరి ప్రభుత్వంతో అవలంబించాల్సిన వైఖరిపై చర్చ జరిగినట్టు సమాచారం. 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆఖరి ప్రావిన్స్ పంజ్‌షిర్‌నూ స్వాధీన పరుచుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించిన తర్వాత త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. తాలిబాన్లకు, హక్కానీ నెట్‌వర్క్ మధ్య నెలకొన్న పొరపొచ్చాలను పరిష్కరించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ చీఫ్ ఆఫ్ఘనిస్తాన్ చేరడం వంటి అనేక పరిణామాలు స్వల్పకాలంలోనే చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిణామాలపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ అయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో హాజరయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకుని మూడు వారాలు గడుస్తున్న తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది. తాలిబాన్లపై తిరుగుబాటునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వవర్గాలు వివరించాయి. కీలక తిరుగుబాటుదారుల నేతలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి తజకిస్తాన్ చేరినట్టు తెలిపాయి. ప్రధాన మంత్రి భేటీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో అవలంబించాల్సిన వైఖరిపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. తాలిబాన్లతో బంధం ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం.

భారత్ దౌత్యాధికారి దీపక్ మిట్టల్ గతవారం ఖతర్‌లో తాలిబాన్ నేతతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ గడ్డను భారత్ వ్యతిరేక ఉగ్రకార్యకలాపాలకు ఉపయోగించరాదని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికిదే తమ ప్రధాన అంశమని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.

click me!