ప్రాణాలు తీసిన వాట్సాప్

First Published Jun 5, 2018, 2:42 PM IST
Highlights

గ్రూపుల్లో ఫోటో షేర్ చేయడంతో..

వాట్సాప్ లో మెసేజ్ లు చేయడం, ఫోటోలు షేర్ చేసుకోవడం కామన్. కానీ.. ఇదే ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మీరు చదివింది నిజమే.. వాట్సాప్ గ్రూపుల్లో ఫోటో షేర్ చేయడం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే..లవ్ జోహార్ (28)అనే వ్యక్తి జోహార్స్ అనే పేరుమీదున్న వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నాడు. జోహార్స్ వాట్సాప్ గ్రూప్‌లో స్థానిక ప్రాంతంలోని (గోత్రా కమ్యూనిటీ) పలువురు వ్యక్తులు, స్నేహితులు సభ్యులుగా ఉన్నారు. గ్రూప్‌లో ఉన్న సభ్యులంతా ఏదైనా ఎలక్షన్ ఉంటే ఎవరికి ఓటు వేయాలనే విషయంపై కలిసి నిర్ణయం తీసుకుంటారు.

ఆదివారం రాత్రి వాట్సాప్ గ్రూప్ సభ్యులంతా డిన్నర్ చేశారు. డిన్నర్ సమయంలో వాట్సాప్ అడ్మిన్‌గా ఉన్న లవ్ జోహార్ వ్యక్తిగత ఫొటో ఒకటి గ్రూప్‌లో షేర్ చేశాడు. దీంతో వాట్సాప్ గ్రూప్ మెంబర్ దినేశ్ అలియాస్ బంటీ జోహ్రీ వాట్సాప్ అడ్మిన్ లవ్‌జోహార్‌తో వాగ్వాదానికి దిగాడు. తన ఇంటికెళ్లి ఈ గొడవను సరిదిద్దుకుందామని దినేశ్ లవ్ జోహార్‌కు సూచించారు. లవ్‌జోహార్ అతని ముగ్గురు సోదరులు ఈ విషయంపై మాట్లాడటానికి దినేశ్ ఇంటికి వెళ్లారు. అయితే దినేశ్ కుటుంబసభ్యులు ఒక్కసారిగా లవ్‌జోహార్‌తోపాటు అతని సోదరులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనలో లవ్‌జోహార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేవలం చిన్న కారణం తీవ్ర ఘర్షణకు దారి తీసి ప్రాణాల మీదకు వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన దినేశ్ సహా అతని ఐదుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

click me!