భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున సెంగోల్ (రాజదండం) కూడా ప్రతిష్టించనున్నారు. అసలు దీని వెనుక కథ ఏంటీ..? దానిని ఎందుకు కొత్త పార్లమెంట్‌లో ప్రతిష్టించున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలుకాబోతోంది. అన్ని హంగులతో , ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు విపక్ష నేతలు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం .. ప్రధాని మోడీ శాసన వ్యవస్థలో భాగం కాదని, ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వ్యక్తని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ప్రారంభోత్సవంలో అనేక వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు వుండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న రాజదండం (సెంగోల్) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్రిటీష్‌వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించి అనంతరం అధికారాన్ని మార్పిడి చేయడానికి గుర్తుగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజదండాన్ని అందుకున్నారు. ఈ చారిత్రక రాజదండాన్ని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించాలని కేంద్రం నిర్ణయించింది. ఐదు అడుగుల పొడవు, పై భాగంలో నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండిదండంతో మెరిసిపోతున్న ఈ సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున దీనిని ప్రతిష్టించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యంతో సాగాలన్న సందేశాన్ని ప్రజలకు , ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని లోక్‌సభలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో వున్న ఈ సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితులతో కలిసి ప్రధాని మోడీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్టించనున్నారు.
అసలేంటీ సెంగోల్.. ఎక్కడి నుంచి వచ్చింది ..?
ఈ రాజదండం గురించి తెలుసుకోవాలంటే మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి వెళ్లాలి. భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించిన సమయంలో అధికార మార్పిడికి గుర్తుగా ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని పాటించాలని నాటి గవర్నర్ జనరల్ నెహ్రూను సంప్రదించారు. దీంతో దీనికి సంబంధించిన బాధ్యతలను రాజీజీకి అప్పగించారు . ఆయన ఎన్నో అధ్యయనాలు, పలువురితో మంతనాల అనంతరం అధికార మార్పిడి కోసం రాజదండం (సెంగోల్) తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనాన్ని సంప్రదించారు.
రాజాజీ అభ్యర్ధన మేరకు రాజదండం తయారీకి అంగీకరించిన మఠాధిపతులు.. చెన్నైకి చెందిన ఓ స్వర్ణకారుడి చేత దానిని తయారు చేయించారు. వెండితో చేసి దానికి బంగారు పూత పూసి..పై భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు. తయారీ పూర్తయిన తర్వాత తిరువడుత్తురై మఠానికి చెందిన స్వామిజీ.. ఆ దండాన్ని 1947 ఆగస్ట్ 14న రాత్రి మౌంట్‌బాటన్‌కు అప్పగించి, ఆ వెంటనే వెనక్కి తీసుకున్నారు. అనంతరం దానిని గంగాజలంతో శుద్ధి చేసి.. నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆంగ్లేయులు స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని నెహ్రూకు అప్పగించారట. ఆ సమయంలో ప్రత్యేకమైన పాటను కూడా ఆలపించారట. ఈ ఘట్టాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆ రోజుల్లోనే ప్రముఖంగా ప్రచురించిందట.
సెంగోల్ శబ్ధం తమిళ భాషలోని సెమ్మై నుంచి వచ్చిందని చెబుతారు. 8వ శతాబ్ధంలో తమిళనాడును పాలించిన చోళుల హయాంలో రాజదండం చేతులు మారడం ద్వారా అధికార మార్పిడి జరిగేది. దీనిని అందుకున్న రాజులు, మహారాజులు, చక్రవర్తుల నుంచి ప్రజలు న్యాయ, నిష్పాక్షికమైన పాలనను ప్రజలు ఆశిస్తారు. 1947లో కొన్ని రోజుల పాటు జనం నోట్లో నానిన ఈ రాజదండం ప్రస్తావన తర్వాత మాయమైంది. అయితే దాదాపు 31 ఏళ్ల తర్వాత 1978 ఆగస్ట్ 15న కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి తన అనుచరుడు, శిష్యుడైన డాక్టర్ బీఆర్ సుబ్రహ్మణ్యంకు ఈ సెంగోల్ గురించి చెప్పారట. దీంతో ఆయన దానిని తన పుస్తకంలో ప్రస్తావించారు.
సెంగోల్ తర్వాత ఏమైంది..?
1947 నుంచి ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో వుంచారు. దీని గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. దానిని పార్లమెంట్ ప్రారంభోత్సవంలో వుంచాలని కోరారు. పార్లమెంట్ భవనం అధికారిక ప్రారంభోత్సవానికి ముందు మోడీ ఈ సెంగోల్‌ను స్వీకరిస్తారు. ఆపై దానిని స్పీకర్ సీటు దగ్గర ప్రతిష్టిస్తారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు శ్రమించిన దాదాపు 60 వేల మంది కార్మికులను ప్రధాని మోడీ సత్కరించనున్నారు. అనంతరం రాజదండ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. 1947 ఆగస్టు 14న దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు దీనిని అందించే కార్యక్రమంలో పాల్గొన్న 96 ఏళ్ల వుమ్మిడి బంగారు చెట్టి కూడా రాజదండ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటారు.