
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పార్లమెంటు ఆ దేశ రాజ్యాంగాన్ని 1973 ఏప్రిల్ 10వ తేదీన ఆమోదించింది. సరిగ్గా 49 ఏళ్ల తర్వాత అదే తేదీన ఈ ఏడాది పాకిస్తాన్‌లో తొలిసారిగా ఒక ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక పదవీచ్యుతుడయ్యాడు. తన క్రికెట్ కెరీర్‌ను ముగించినట్టుగా పీఎం పదవిని ఆయన గౌరవప్రదంగా స్వస్తి పలుకలేదు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని 174 మంది (మొత్తం 342 మంది) మద్దతు తెలుపడంతో గద్దె దిగక తప్పనిపరిస్థితి. అయితే, పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ పవర్ పాలిటిక్స్‌తో భారత్‌పై ఏవైనా ప్రభావం పడే అవకాశం ఉన్నదా? ఈ మార్పు తర్వాత మన దేశంతో పాకిస్తాన్ సంబంధాల్లో మార్పులు రావొచ్చా? అనే అంశంపై చర్చ మొదలైంది.
ఒక ప్రజాస్వామిక దేశానికి పొరుగు దేశాలు కూడా ప్రజాస్వామిక దేశాలైతే ఎంతో బాగుంటుంది. అదిగాక వేరే స్వరూపంలోనో.. మిలిటరీ ఆధిపత్య లేదా ఇతర రూపాల్లోని ప్రభుత్వాలతో పొసగదు. తరుచూ సరిహద్దుల్లో ఘర్షణలకు అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం లోపభూయిష్టమైంది. వారాలపాటుగా జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చ, సుప్రీంకోర్టు ప్రమేయం వంటి అంశాలతో ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం కొన్ని రోజులు ఊగిసలాడింది. ఆ తర్వాత ఎట్టకేలకు ఈ అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ వేసి ప్రధానిని తొలగించే దశకు నేడు పాకిస్తాన్ చేరుకుంది. అంటే.. మెల్లమెల్లగా పాకిస్తాన్‌లో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం దాని నేలను వెతుక్కుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ రాజకీయాల్లో ఇండియా అంశం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ తొలగింపు ఎపిసోడ్‌లోనూ బహిరంగంగా ఇండియా పేరు కనీసం ఒక అరడజను సార్లు బయటకు వచ్చింది. భారత దేశ విదేశాంగ పాలసీని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. అంతర్జాతీయ, డిఫెన్స్ పాలసీని పాకిస్తాన్ మిలిటరీ కంట్రోల్ చేయడాన్ని ఆయన విమర్శించారు. ఇది సహజంగానే పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రాబల్యాన్ని చూపెట్టే మిలిటరీకి నచ్చలేదు.
ఒక వైపు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించే పనులు జరుగుతుండగా.. పాకిస్తాన్ మిలిటరీ భారత్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. జమ్ము కశ్మీర్ అంశంపై స్పందించింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చర్చలకు సిద్ధం అని వివరించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిలిటరీ మరికొన్ని సార్లు జమ్ము కశ్మీర్ అంశంపై చర్చించడానికి ఆహ్వానాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది.
కాగా, ఇమ్రాన్ ఖాన్ పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నంలో విఫలం అయ్యాడు. ప్రధాని మోడీపై వ్యక్తిగతంగా ఆయన దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య రాజకీయ వ్యవహారాలను సంక్లిష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మళ్లీ దౌత్యపరమైన సంభాషణలు మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి రావాలంటే.. 172 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.