
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని, సీఎం అభ్యర్థిగా ఉండాలని ఆఫర్ ఇచ్చినా బీఎస్పీ అధినేత్రి ఒప్పుకోలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. రాహుల్ గాంధీకి ఘాటైన సమాధానం ఇచ్చారు. ముందుగా సొంత పార్టీని చక్కబెట్టుకోవాలని, తమ పార్టీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చేందుకు ఆదివారం మాయావతి మీడియాతో మాట్లాడారు. “ కాంగ్రెస్ తన సొంత దారిని సరిదిద్దుకోలేకపోతుంది. దాని సొంత ఇంటిని క్రమబద్ధీకరించుకోలేకపోతుంది. కానీ మా విషయాల్లోకి చొరబడుతోంది. బీఎస్పీపై వ్యాఖ్యానించే ముందు కాంగ్రెస్, రాహుల్ గాంధీ 100 సార్లు ఆలోచించాలి ’’ అని అన్నారు.
బీఎప్పీకి బీజేపీ భయం ఉందని, పొత్తు గురించి తమని సంప్రదించారని, కూటమి విజయం సాధిస్తే తనకు సీఎం పదవి ఇస్తానని శనివారం రాహుల్ గాంధీ చెప్పారని మాయావతి అన్నారు. కానీ అవన్నీ అబద్దాలే అని తెలిపారు. ఈ వ్యాఖ్యల వల్ల రాహుల్ గాంధీకి దళితులు, బీఎస్పీ పట్ల ఎలాంటి నీచమైన భావాలు ఉన్నాయో తెలుస్తున్నాయని అన్నారు.
ఈ మీడియా సమావేశం సందర్బంగా మాయావతి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కూడా విరుచుకుపడ్డారు. ‘‘ వారు భారతదేశాన్ని కేవలం ‘ కాంగ్రెస్-ముక్త్ ’గా కాకుండా ‘ప్రతిపక్ష-ముక్త్’ గా కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా చైనా రాజకీయ వ్యవస్థ మాదిరిగానే భారతదేశంలో కూడా జాతీయ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఒకే ఆధిపత్య పార్టీతో మిగిలిపోయేలా చేస్తున్నాయి ’’ అని అన్నారు.
‘‘ మాది పార్లమెంటులో బలవంతంగా ప్రధానమంత్రినికి కౌగిలించుకున్న రాహుల్ గాంధీ లాంటి పార్టీ కాదని, ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలైన పార్టీ కాదు ’’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ బీఎస్పీ అధినేత్రిని సంప్రదించిందని, ఆమెకు సీఎం పదవి కూడా ఆఫర్ చేశామని అయితే వాటికి ఆమె స్పందించలేదని శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ మాయావతి జీ ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్‌లో) పోరాడలేదు. కూటమి ఏర్పాటు చేయమని మేము ఆమెకు సందేశం పంపాము. కానీ ఆమె స్పందించలేదు. ఈసారి ఆమె దళితుల గొంతు కోసం పోరాడలేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఉన్నాయని ఆమె భయపడ్డారు ’’ అని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్, బీఎస్పీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అక్కడ మళ్లీ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 403 స్థానాలకు గానూ కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందగా, బీఎస్పీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌కు 2.5 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 97 శాతం మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. BSP దాదాపు 13 శాతం ఓట్లను గెలుచుకుంది. దాని అభ్యర్థులలో 72 శాతం మంది ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. కాగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన సవాలుగా నిలిచింది.