Mallikarjun Kharge: విపక్ష కూటమికి మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థి అయితే..!?

INDIA Bloc విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడం సంచలనమైంది. జేడీయూ నుంచి అసంతృప్తులు రాగానే.. రాహుల్ గాంధీ వెంటనే నితీశ్ కుమార్‌కు భరోసాగా మాట్లాడారు. విపక్ష కూటమికి పీఎం క్యాండిడేట్ ఎవరైతే కూటమి సుస్థిరంగా ఉంటూనే బీజేపీని దీటుగా ఎదుర్కోగలదు?
 


Mallikarjun Kharge: లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల వ్యవధి ఉన్న తరుణంలో రాజకీయంగా అనేక వ్యూహాలు, వాదనలు తెర మీదికి వస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మెషీన్ బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇండియా కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు వ్యవహారమే జఠిలంగా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిపై మరెంత రభస ఉంటుందో ఊహించుకోవచ్చు. తరుచూ విపక్ష శిబిరంలో భిన్నాభిప్రాయాలు, విభేదాలు పొడసూపడంతో దాని శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వచ్చాయి. కానీ, డిసెంబర్ 19 నాటి ఇండియా కూటమి సమావేశంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గూగ్లీ వేశారు. విపక్ష కూటమికి మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని వీరు ప్రతిపాదించారు. ఇది ఒకింత విపక్ష కూటమిలో జోష్ నింపగా.. నితీశ్ కుమార్ పార్టీకి మాత్రం మూర్ఛవచ్చినంత పని చేసింది.

కాంగ్రెస్ పార్టీ మరో మన్మోహన్ సింగ్‌ను సిద్ధం చేసుకుంటున్నదా? అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఖర్గేకు ప్రాధాన్యత ఇవ్వడం గమనిస్తే.. ఆ పార్టీ వ్యూహాత్మకంగానే ఖర్గేను బలపరుస్తున్నదా? అనే అనుమానాలు రాకమానవు. నిజానికి ఇప్పుడున్న స్థితిలో మల్లికార్జున్ ఖర్గే సరైన ఎంపిక అనే వాదనలూ ఉన్నాయి. విపక్ష కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. కూటమికి నాయకత్వాన్ని అందించే స్థితిలోనూ అదే ఉన్నది. ఆ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కంటే మల్లికార్జున్ ఖర్గేను ఎంపిక చేసుకుని బీజేపీపై పోటీకి దిగడం చాలా విధాలుగా సముచిత నిర్ణయంగా చెబుతున్నారు.

Latest Videos

Also Read: Pawan Kalyan: జనసేన పార్టీకి బిగ్ షాక్.. గాజు గ్లాసు గుర్తు కోసం ఈసీకి జాతీయ జనసేన పార్టీ విజ్ఞప్తి!

విపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్థిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా నితీశ్ కుమార్ పార్టీకి మాత్రం అభిప్రాయాలు దాదాపు నిర్ణయాల దశకూ సమీపంలో ఉన్నాయి. విపక్ష కూటమి పీఎం క్యాండిడేట్‌గా నితీశ్ కుమారే ఉండాలనేంతగా ఆ పార్టీ నేతల్లో అభిప్రాయాలు ఉన్నాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వేసిన గూగ్లీ ఒక కొత్త ప్రతిపాదనను, ఉత్తేజాన్ని తేవడమే కాదు.. నితీశ్ కుమార్‌కు చెక్ పెట్టింది.

రాహుల్ గాంధీ నిజాయితీగా పోరాడుతున్నా.. బీజేపీ ఆయనపై ఒక ఇమేజ్‌ను సృష్టించింది. పప్పు అని సులువుగా దాడి చేయగల వాతావరణాన్ని తయారు చేసింది. దానికి తోడు పార్ట్ టైమ్ పొలిటీషియన్, ఇటలీ వారసుడు, ఎన్నికల హిందువు, కుటుంబ రాజకీయాలు, ఇలా.. బీజేపీ దాడి చేయడానికి అనేక అస్త్రాలు సంసిద్ధంగా ఉన్నాయి.

అదే మల్లికార్జున్ ఖర్గేను విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం నిజంగానే బీజేపీలో ఒక కలవరం పుట్టే అవకాశం ఉన్నది. అపార అనుభవానికి తోడు.. ఒక దళిత నాయకుడిని ప్రధానమంత్రి పీఠంపైకి ఎక్కించే విపక్ష కూటమి నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీసీ సీఎం, గిరిజన రాష్ట్రపతి వంటి నిర్ణయాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ మేరకు ఆదరణ చూరగొన్నది. ఈ దారిని విపక్ష కూటమి సద్వినియోగం చేసుకోవచ్చు. 

Also Read: Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికలకూ సునీల్ కనుగోలుకు బాధ్యత.. కాంగ్రెస్ కీలక నిర్ణయం

విపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు ఎక్కువ కాబట్టి, ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక చాలా సున్నితమైన అంశంగా మారనుంది. దళిత నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపాదిస్తే.. ఎంపిక చేస్తే.. ఆయనను వ్యతిరేకించే అవకాశాలు స్వల్పం. దళిత నేతను వ్యతిరేకించి వాటి ఓటు బ్యాంక్‌ను అస్థిరం చేసుకునే సాహసానికి ఇతర విపక్ష పార్టీలు ఒడిగట్టకపోవచ్చు. కాబట్టి, పీఎం అభ్యర్థి సవాల్‌ను మల్లికార్జున్ ఖర్గేతో అధిగమించవచ్చు.

click me!