
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని నుహ్ లో చోటు చేసుకున్న హింస దురదృష్టకరంగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. బుధవారంనాడు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారన్నారు. ఇద్దరు హోంగార్డులతో పాటు నలుగురు పౌరులు మృతి చెందినట్టుగా ఆయన తెలిపారు. నుహ్ లో గాయపడిన వారు గురుగ్రామ్ లోని మేదాంతతో పాటు ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఈఘటనకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని సీఎం ఖట్టర్ పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉండి పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సీఎం చెప్పారు.ఈ ఘటనతో సంబంధం ఉన్న 116 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఖట్టర్ చెప్పారు. అరెస్టైన వారిని రిమాండ్ కు పంపుతామన్నారు.
మరో వైపు ఈ ఘటనకు బాధ్యులైన వారి నుండి ఆస్తుల నష్టాన్ని చెల్లించేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగితే ప్రభుత్వం నష్టపరిహరాన్ని భరిస్తుందన్నారు. ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినంతవరకు నష్టానికి కారణమైన వారి నుండి భర్తీచేస్తామని సీఎం ఖట్టర్ చెప్పారు.ఈ మేరకు ఓ చట్టాన్ని కూడ రూపొందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించే చర్యలకు తమ ప్రభుత్వం అనుమతించబోదని సీఎం తేల్చి చెప్పారు.
రెండు రోజుల క్రితం మతపరమైన ఊరేగింపుపై ప్రత్యర్ధి వర్గం రాళ్లు రువ్వింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులకు కూడ దిగారు.