Republic Day 2022: ఈ ఏడాది కొత్తగా జరిగినవి ఇవే..!

By Mahesh KFirst Published Jan 26, 2022, 6:01 PM IST
Highlights

కరోనా మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలు పరిమితుల్లోనే జరుగుతున్నాయి. అయితే, కరోనా పరిమితులు అటుంచితే.. కేంద్ర ప్రభుత్వం ఈసారి గణతంత్ర వేడుకల్లో అనేక కొత్త అంశాలను జోడించింది. అందుకే ఈ ఏడాది గణతంత్ర వేడుకలు కొంత విభిన్నతను సంతరించుకుంది. ఈ ఏడాది చేరిన కొత్త అంశాలను ఓసారి చూద్దాం.

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది తరహాలో ఈ సారి కూడా దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు(Republic Day) జరిగాయి. కరోనా మహమ్మారి(Coronavirus) కారణంగా ఈ వేడుకలు కొన్ని పరిమితుల్లో(Limitations) జరుగుతున్నాయి. అయితే, కరోనా పరిమితులతోపాటు ఈ రోజు నిర్వహించిన వేడుకల్లో అనేక అంశాలు(Firsts) కొత్తగా చోటుచేసుకున్నాయి. ఆ విషయాలను ఒక సారి పరిశీలిద్దాం. ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నేతాజీ(Netaji) సుభాష్ చంద్రబోస్ జయంతిని కూడా కలిపారు. అంటే ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన గణతంత్ర వేడుకలు మొదలు అయ్యేవి. కానీ, ఈ సారి జనవరి 23వ తేదీనే మొదలయ్యాయి. జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.

సాధారణంగా ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాలు ప్రారంభమయ్యే సమయానికంటే కొంత ఆలస్యంగా ఈ సారి ప్రారంభం అయ్యాయి. అంటే ఉదయం 10.30 గంటలకు కొంత లేట్‌గా గణతంత్ర ఉత్సవాలు మొదలయ్యాయి. ఢిల్లీలో ఈ రోజు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎప్పటిలాగే ప్రదర్శించే శకటాలు ఈ సారి కూడా ప్రదర్శించారు. అయితే, ఈ సారి శకటాల సంఖ్యను కుదించారు. రాష్ట్రాలకు చెందిన 12 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన తొమ్మిది శకటాలను ఈ సారి ప్రదర్శించారు. సమయాన్ని కుదించడం, ప్లేస్‌ కూడా గతంలో కంటే తక్కువగా ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ పీఆర్వో వెల్లడించారు.

ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్‌లో అత్యధికంగా 75 విమానాలు ప్రదర్శన ఇచ్చాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలకు చెందిన 75 యుద్ధ విమానాలను ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో ఉపయోగించారు. కాగా, ప్రభుత్వ చానెల్ డీడీ భారత వైమానిక దళంతో ఒప్పందం పెట్టుకుంది. తద్వారా తొలిసారిగా విన్యాసాలు చేస్తున్న విమాన పైలట్‌లకు ఇచ్చిన కెమెరాల వీడియోలను లైవ్‌లో డీడీ ప్రసారం చేసింది. అలాగే కాక్‌పిట్ వ్యూ కూడా ప్రసారం చేసింది.

పరేడ్‌లో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో దేశవ్యాప్తంగా పోటీ పెట్టి ఎంపిక చేసిన డ్యాన్సర్లతో నృత్య ప్రదర్శన ఇప్పించారు. డిఫెన్స్, కల్చర్ మినిస్ట్రీలు నిర్వహించిన వందే భారతమ్ కాంపిటీషన్‌లో 480 మందిని సెలెక్ట్ చేశారు. వారే పరేడ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేశారు.

వీటికితోడు ఈ ఏడాదే తొలిసారిగా బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో డ్రోన్‌లు, లేజర్ షోలు ఉంనున్నాయి. ఈ ముగింపు కార్యక్రమం జనవరి 29వ తేదీన జరుగుతుంది. తొలిసారిగా, ఈ కార్యక్రమం మహాత్ముడికి ఇష్టమైన పాట అబైడ్ విత్ మీ అనే పాట లేకుండా జరగనుంది. మార్చింగ్ కాంటింజెంట్లు ఎర్రకోట వరకు వెళ్లకుండా మధ్యలోని నేషనల్ స్టేడియం వరకే వెళ్లనున్నాయి. కరోనా కారణంగా 15ఏళ్లకు లోపు ఉండే పిల్లలను ఈ పరేడ్‌కు అనుమతించరు. కాగా, రెండు డోసులు వేసుకున్న వయోజనులను మాత్రమే ఇందుకు అనుమతించనున్నారు.

గతేడాది లాగే.. ఈ సారి కూడా విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించలేదు. కరోనా మహమ్మారి కారణంగా విదేశీ కాంటింజెంట్ల ప్రదర్శన లేదు.

click me!