
Asaduddin Owaisi On Asad Ahmed Encounter: ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా మారిన అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ తో పాటు గులాం అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఈ నేపథ్యంలోనే అసద్ ఎన్ కౌంటర్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. "మహాజాబ్ పేరుతో బీజేపీ ఎన్ కౌంటర్లు నిర్వహిస్తోందన్నారు. కోర్టులు, న్యాయమూర్తులు దేనికి? కోర్టులు మూసివేయండి.. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్న జునైద్, నాసిర్లను చంపిన వారిని బీజేపీ కాల్చి చంపుతుందా?.." అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది ఎన్ కౌంటర్ కాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. "బుల్లెట్ తో న్యాయం చేస్తామని నిర్ణయిస్తే న్యాయస్థానాలు దేనికి..? కోర్టులను మూసివేయండి" అని మండిపడ్డారు.
ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు
ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ను హతమార్చిన ఇద్దరు వ్యక్తులు ఎన్ కౌంటర్ లో గాయపడ్డారనీ, ఈ క్రమంలోనే వారు ఆ తర్వాత మరణించారని యూపీ పోలీసులు తెలిపారు. వారిని అసద్ అహ్మద్, గులాంగా గుర్తించారు. నిందితుల నుంచి అత్యాధునిక విదేశీ ఆయుధాలు, బుల్ డాగ్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
అఖిలేష్ యాదవ్ సైతం..
అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఎన్ కౌంటర్ పై పలు ప్రశ్నలు లేవనెత్తారు. తప్పుడు ఎన్ కౌంటర్లు నిర్వహించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కోర్టుపై బీజేపీకి నమ్మకం లేదన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్ కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపి దోషులకు శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. తప్పొప్పుల విషయంలో శిక్షల విధింపు నిర్ణయాలు తీసుకునే హక్కు అధికారానికి లేదనీ, బీజేపీ సోదరభావానికి వ్యతిరేకమంటూ పేర్కొన్నారు.