రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ నెల 22వ తేదీన రాజీనామా చేసే అవకాశం ఉన్నదని సమాచారం అందింది. ఎమర్జెంట్ జనరల్ కౌన్సింట్ మీటింగ్ అదే రోజు జరగనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారులు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ నెల 22వ తేదీన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఆయనపై క్రీడాకారులు లైంగిక వేధింపుల ఆరోపణలను బుధవారం చేసిన సంగతి తెలిసిందే. వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా సహా చాలా మంది రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఫోగట్ ఆరోపణలు చేశారు.
ఈ నెల 22న ఎమర్జెంట్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరగనున్నది. ఈ సమావేశంలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేస్తారని కొన్ని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఇది తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘కొంత మంది రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ, వారు చేస్తున్న ఆరోపణలు తనకు తెలియదు’ అని అన్నారు.
Also Read: రెజ్లర్ల పోరాటానికి పెరుగుతున్న మద్దతు.. మహిళా అథ్లెట్ల భద్రత ముఖ్యమన్న హర్యానా సీఎం
ఫెడరేషన్ ఒక డిక్టేటర్‌లా ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, వారు విచారణకు వచ్చేవారు కాదు.. జాతీయ స్థాయిలో ఆడేవారూ కాదని అన్నారు. అసలు సమస్య ఎక్కడ ఉన్నదంటే ఫెడరేషన్ రూల్స్ పెట్టడం వద్దే ఉన్నదని తెలిపారు. ఈ రోజు ధర్నాకు కూర్చున్న ప్లేయర్లలో ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో ఆడలేదని అన్నారు. ఇది తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక కుట్ర అని తెలిపారు. దీని వెనుక ఒక పెద్ద పారిశ్రామిక వేత్త హస్తం ఉన్నదని చెప్పారు. వినేశ్ ఫోగట్ ఓడిపోయినప్పుడు ఆమె మోటివేట్ చేసిందే తను అని వివరించారు.