West Bengal SSC scam: జైలు నుంచి మమతా బెనర్జీకి ఫోన్ చేసిన మంత్రి పార్థ ఛటర్జీ.. కానీ.. 

By Rajesh KFirst Published Jul 25, 2022, 2:19 PM IST
Highlights

West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ  ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి కాల్ చేశారట‌. కానీ దీదీ మాత్రం సమాధానం ఇవ్వలేదట‌. శనివారం మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేశాక.. సీఎంకు 3 సార్లు కాల్స్ చేశారని, కానీ,  అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆ రాష్ట్ర‌ క్యాబినెట్ మంత్రి, మాజీ విద్యాశాఖ‌ మంత్రి పార్థ ఛటర్జీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. పార్థ ఛటర్జీ ని అరెస్టు అయిన తర్వాత.. ఆయ‌న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మూడుసార్లు ఫోన్ చేశార‌ట. కానీ.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదట‌. శనివారం ఆయ‌న‌ను ఈడీ అరెస్ట్ చేశాక సీఎంకు 4 సార్లు కాల్స్ చేశారని, అయితే అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ‘అరెస్ట్ మెమో’లో పోలీసులు పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన‌ "అరెస్ట్ మెమో" ప్రకారం..  పార్థ ఛటర్జీ మంత్రి తన బంధువు లేదా స్నేహితుల‌ను  పిలవడానికి బదులుగా సీఎం మమతా బెనర్జీకి కాల్ చేశార‌ట‌. అరెస్టు చేసిన తర్వాత.. తొలిసారి మధ్యాహ్నం 1.55 గంటలకు, ఆ త‌రువాత మ‌రుస‌టి రోజు  ఉదయం 2.30 ఒకసారి, ఉదయం 3.37 గంటలకు, ఆ త‌రువాత ఉదయం 9.35 గంటలకు దీదీకి పార్థ చ‌ట‌ర్జీ ఫోన్ చేశార‌ట‌. కానీ, ఆమె ఫోన్ ఎత్తలేదని స‌మాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏ నిందితుడైన వ్యక్తి తన అరెస్టు గురించి తెలియజేయడానికి బంధువు లేదా స్నేహితుడికి కాల్ చేయడానికి అనుమతించబడతారు. అయితే.. ఈ విష‌యాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. అరెస్టయిన మంత్రి మమతా బెనర్జీ ఫోన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వద్ద ఉన్నందున ఆమెకు కాల్‌ చేసే ప్రశ్నే లేదని ఆ పార్టీ నేత‌ ఫిర్హాద్‌ హకీమ్‌ తెలిపారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై బెంగాల్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఛటర్జీని శనివారం అరెస్టు చేశారు.

పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ .. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్ రిక్రూట్‌మెంట్ లో అక్రమాలకు పాల్పడినట్లు ఛటర్జీపై ఆరోపణలు వచ్చాయి. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో సుమారు రూ.20 కోట్ల నగదు దొరికింది. ఛటర్జీ అసౌకర్యానికి గురైనందున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తరలించిన వెంటనే ఆసుపత్రిలో చేరారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి నుండి ఆయనను తరలించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది,  ఛటర్జీని ఎయిమ్స్-భువనేశ్వర్‌కు తరలించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించడంతో ఈ రోజు ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో ఒడిశాకు త‌ర‌లించారు. పరీక్షల నిమిత్తం ఆయనను ఈరోజు ఆసుపత్రికి హాజరుపరచాలని కూడా కోర్టు తెలిపింది.

click me!