
West Bengal panchayat poll violence: పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాల్లో శనివారం కనీసం 18 మంది మరణించారు. 20 జిల్లాల్లో జరిగిన మూడు అంచెల పంచాయతీ ఎన్నికలలో విస్తృతమైన హింస, బ్యాలెట్ పత్రాల దోపిడీ, రిగ్గింగ్‌లు చోటుచేసుకున్నాయని సమాచారం. రెండంచెల పంచాయతీలున్న రెండు కొండ ప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్‌లలో మాత్రమే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శనివారం నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న హింసకాండ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37కు పెరిగిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ సజావుగా జరిగేలా చూడటంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. అదనపు బలగాలను మోహరించాలనే ఆలోచనను తొలుత వ్యతిరేకించిన ఎన్నికల సంఘాన్ని కలకత్తా హైకోర్టును కూడా నిలదీసింది. బూత్ స్థాయిలో హింస రాజకీయ సంస్కృతిలో లోతుగా కూరుకుపోయిన ఈ రాష్ట్రంలో ఎన్నికల వాచ్ డాగ్ తన బాధ్యత విషయంలో మరింత సమర్థవంతంగా, సీరియస్ గా వ్యవహరించాల్సిందని పేర్కొంది.
గత 2018 పంచాయతీ ఎన్నికలలో బెంగాల్ అంతటా 23 మంది మరణించారు, వారిలో 12 మంది పోలింగ్ రోజున ప్రాణాలు కోల్పోయారు. కాగా, జులై 11న ఫలితాలు వెలువడనుండగా, భారతీయ జనతా పార్టీ(బీజేపీ), సీపీఎం, కాంగ్రెస్ సహా విపక్షాలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. జూన్ 19 నుంచి జూలై 8 వరకు 7 మందిని బలిగొన్న ఎన్నికలకు ముందు జరిగిన హింసను ఆపడానికి తగిన చర్యలు తీసుకోలేదని గతంలో కోర్టు మందలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాజీవ్ సిన్హాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. బెర్హంపూర్ లోక్సభ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'తృణమూల్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందన్నారు. ఎక్కడికక్కడ ఓట్లను కొల్లగొట్టారు. పంచాయతీ ఎన్నికల్లో దీంతో టీఎంసీ ఇప్పటికే విజయం సాధించింది' అని వ విమర్శలు గుప్పించారు.
2013లో టీఎంసీ తొలిసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 మంది చనిపోయారు. అలాగే, బీజేపీ నేత సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మొత్తం 15 జిల్లాల్లో 822 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించాలని ఎస్ఈసీ జూన్ 22న ఆదేశించినప్పటికీ, 649 కంపెనీలు మాత్రమే సకాలంలో రాష్ట్రానికి చేరుకున్నాయని రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో శనివారం సీఏపీఎఫ్ ను మోహరించలేదని ఓటర్లు, ప్రతిపక్షాలు ఆరోపించాయి. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున ఎన్నికలు ముగిసిన తర్వాత పంజాబ్ పోలీసు బృందం కోల్ కతాకు చేరుకుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాష్ట్ర పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కాగా, పోలింగ్ రోజు నుంచి హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ పలు పార్టీలు ఘర్షణలకు కారణమంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అర్హులైన ఓటర్ల సంఖ్య 56.7 మిలియన్లు. మొత్తం మూడు అంచెల్లో 9.5 శాతానికి పైగా పంచాయతీ స్థానాలను టీఎంసీ ఏకగ్రీవంగా గెలుచుకుందని గత నెలలో నామినేషన్ పత్రాల ఉపసంహరణ తర్వాత ఎస్ఈసీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2018లో అధికార పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకోగా, అందులో 34 శాతం పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యాయి.