బెంగాల్‌లో ఇద్దరు మంత్రుల అరెస్ట్: కోల్‌కత్తా సీబీఐ కార్యాలయం ముందు మమత ధర్నా

By narsimha lodeFirst Published May 17, 2021, 2:29 PM IST
Highlights

 ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ కోల్‌కత్తాలోని సీబీఐ కార్యాలయం వద్ద సోమవారం నాడు ధర్నాకు దిగారు. 

కోల్‌కత్తా:   ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ కోల్‌కత్తాలోని సీబీఐ కార్యాలయం వద్ద సోమవారం నాడు ధర్నాకు దిగారు. నారదా స్టింగ్ ఆపరేషన్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఇద్దరు మంత్రులను అరెస్ట్  చేయడంపై సీఎం మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కత్తాలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రులను నిబంధనల మేరకు అరెస్ట్  చేయలేదు, తనను కూడా అరెస్ట్ చేయాలని  ఆమె సీబీఐ కార్యాలయం ముందు  నిరసన చేపట్టారు. సీబీఐ కార్యాలయం వద్దకు టీఎంసీ మద్దతుదారులు  పెద్ద ఎత్తున చేరుకొన్నారు. మమతకు మద్దతుగా   చేరుకొన్నారు. 

సీబీఐ అధికారులకు, బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీ నేతలు  నినాదాలు చేశారు. దీంతో కోల్‌కత్తా సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులను  సీబీఐ అధికారులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కత్తా మాజీ మేయర్ సోమన్ చటర్జీని కూడ సీబీఐ కార్యాలయానికి తరలించారు.  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే  సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారని టీఎంసీ నేతలు ఆరోపించారు. గవర్నర్ జగదీష్ ధనకర్ అనుమతి మేరకే వీరిపై విచారణను నిర్వహిస్తున్నట్టుగా  సీబీఐ అధికారులు ప్రకటించారు. 

click me!