
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసానికి ఆమె వెళ్లారు. అక్కడే శరద్ పవార్‌తో మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని శరద్ పవార్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలతో మమతా బెనర్జీ రేపు సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ భేటీకి ఒక రోజు ముందే ఆమె శరద్ పవార్‌తో భేటీ కావడం గమనార్హం.
ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన చాలా విషయాలను తాము చర్చించామని శరద్ పవార్ పేర్కొన్నారు. అయితే, రేపు జరిగే ప్రతిపక్ష నేతల సమావేశం గురించీ, అందునా రాష్ట్రపతి ఎన్నిక గురించి చర్చించినట్టు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
రేపు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూటషన్ క్లబ్‌లో రేపు ప్రతిపక్ష నేతలతో మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం కోసం ఆమె ఈ రోజు ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఈ సమావేశానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె తన నివాసానికి కాకుండా నేరుగా శరద్ పవార్ నివాసానికి వెళ్లినట్టు తెలిసింది.
జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సంప్రదింపులనూ ప్రారంభించింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపితే అన్ని ప్రతిపక్షాలే కాదు.. అధికారపక్షంలోని కొందరు నేతలు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావించింది. అందుకోసమే ఏకంగా పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ..శరద్ పవార్ వద్దకు పంపింది. ఆయన శరద్ పవార్‌తో ముంబయిలో సమావేశం అయ్యారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు.
కానీ, ఈ రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక విషయాన్ని పేర్కొన్నారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను బరిలోకి దిగడం లేదని తన పార్టీ సమావేశంలో వెల్లడించినట్టు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. అదే సందర్భంలో ఎన్సీపీ వర్గాలు గులాం నబీ ఆజాద్ సరైన వ్యక్తి అనే అభిప్రాయాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, రేపు మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి కాంగ్రెస్ కూడా హాజరు కాబోతున్నట్టు తెలిపింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రేపటి సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి రాబోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అటెండ్ అవుతారు. దేశంలోని 22 పార్టీలకు ఆమె లేఖలు రాశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.