కాసేపట్లో పెళ్లి.. వరుడికి కరోనా పాజిటివ్..!

By telugu news teamFirst Published Jul 31, 2021, 11:21 AM IST
Highlights

పెళ్లి మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరి వెళ్లిన తర్వాత.. అతనికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసింది. దీంతో.. పెళ్లి కాస్త ఆగిపోయింది

మరి కొద్ది గంటల్లో వారు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాల్సి ఉంది. అలాంటి సమయంలో.. వారికి ఊహించని షాకింగ్ విషయం తెలిసింది.  పెళ్లి మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరి వెళ్లిన తర్వాత.. అతనికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసింది. దీంతో.. పెళ్లి కాస్త ఆగిపోయింది. మండపంలో అడుగుపెట్టాల్సిన వరుడు కాస్త.. ఐసోలేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ జిల్లా చందోయ్‌ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్‌ నిర్వహించుకుంటూ వధువు గ్రామం చందోయ్‌కు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దులో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెగటివ్‌ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారు. ‘సార్‌ పెళ్లి ఉంది.. వదిలేయండి’ అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు విసుగు చెంది అక్కడే సరిహద్దులో పరీక్షలు చేయించుకున్నారు. 41 మందికి పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. 

కానీ ఆ ఒకరికి మాత్రం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అది కూడా వరుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి ఉండడంతో జాలిపడి పోలీసులు మూడుసార్లు పరీక్షలు చేశారు. మూడింటిలోనూ పాజిటివ్‌ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకిందని నిర్ధారించారు. వెంటనే బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్‌ కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చేరవేశారు. ఈ హఠాత్పరిణామానికి వారు అవాక్కయ్యారు. చివరకు చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ పెళ్లి మా సావుకొచ్చింది’ అంటూ కరోనా భయంతో బంధువులు వెనక్కి తగ్గారు. 

click me!