
అస్సాంలోని అన్ని ప్రాంతాల నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో సారి స్పష్టం చేశారు. గువాహటిలో జరిగిన ఒక సభలో మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని 13 జిల్లాలను AFSPA ను రహితంగా మార్చామని అన్నారు.
ఎనిమిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో అస్సాంలోని 60 శాతానికి పైగా ప్రాంతం నుంచి దీనిని తొలగించామని చెప్పారు. అమిత్ షా అన్నారు. అస్సాంలో శాంతిభద్రతలు మెరుగుపడటం, శాంతి ఒప్పందాల కారణంగా ఈ చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు తగ్గిపోయాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించేలా చూస్తామని అమిత్ షా అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా సోమవారం అస్సాం చేరుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన సోమవారం ప్రకటించారు. తదుపరి జనాభా గణన 100 శాతం పరిపూర్ణతతో డిజిటల్ జనాభా గణన అవుతుందని ఆయన అన్నారు.
‘‘ జనాభా గణన విధాన రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జనాభా గణనను శాస్త్రీయంగా, ఖచ్చితమైనదిగా, బహుముఖంగా చేయాలని, దాని డేటా విశ్లేషణ కోసం ఏర్పాట్లు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మేము కొత్త సాఫ్ట్ వేర్ ను తయారు చేయబోతున్నాము. ఈ సాఫ్ట్ వేర్ లో జనన-మరణ రిజిస్టర్ ను జోడించడానికి ఏర్పాట్లు ఉంటాయి. రాబోయే రోజుల్లో మేము దానిని బహుముఖ మార్గాల్లో కూడా ఉపయోగించబోతున్నాము ’’ అని అమిత్ షా చెప్పారు. అంతకుముందు అమిత్ షా గౌహతిలోని అమిన్ గాన్ లోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ లో వర్చువల్ లైవ్ స్ట్రీమ్ ద్వారా సశస్త్ర సీమా బల్ (SSB) భవనాలను ప్రారంభించారు. 37వ బీఎన్ మంగళ్ దోయ్ ను కూడా ఆయన సందర్శించారు. పారామిలటరీ దళం యూనిట్ల సంసిద్ధతను సమీక్షించారు.
1958లో ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తీసుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో, అల్లరు చోటుచేసుకునే ప్రాంతాల్లో పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై హెచ్చరికలు జారీ చేసిన తరువాత అతనిపై బలవంతంగా కాల్పులు జరపడానికి కూడా బలగాలకు అనుమతి ఉంటుంది. ఈ చట్టం ఎలాంటి వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చట్టం వల్ల సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే దీని వల్ల అమాయక ప్రజలపై కూడా కొన్ని సార్లు కాల్పులు జరిగాయి. దీంతో ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తేయాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో దీనిని తొలగించారు.